సీఎంఆర్ మిల్లర్లపై చర్యలు శూన్యం..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ఈ నెల 16న ప్రారంభం కానున్నాయి.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ఈ నెల 16న ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లాలో 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పౌర సరఫరాల అధికారులు నిర్ధారించారు. అందుకనుగుణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో 467, కామారెడ్డి జిల్లాలో 350 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ధాన్యం సేకరణ జరిగిన వెంటనే నేరుగా మిల్లర్లకు కేటాయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో రైస్ మిల్లర్లు మహాముదుర్లుగా చెప్పాలి. యాసంగితో పాటు ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) ను ఇప్పటికీ ఎఫ్ సీఐకి అప్పగించలేదు. అలా అని వారి వద్ద ధాన్యం కూడా లేదు. బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నారన్న ఆరోపణలున్నాయి. కానీ పౌర సరఫరాల అధికారులు వారికి గడువు పొడగింపు అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. గత నెల చివరి వరకు సీఎంఆర్ రికవరీకి గడువు ఇచ్చినా మిల్లర్లు పట్టించుకోలేదు. గత రెండు సీజన్ లకు సంబంధించిన బియ్యం ఇవ్వకపోయినా వారికి మళ్లీ కేటాయింపులు చేయడం విమర్శలకు దారితీసింది.
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 324 రైస్ మిల్లులున్నాయి. అందులో బాయిల్డ్ రైస్ మిల్లులు 60 కాగా రా రైసుమిల్లులు 210 ఉన్నాయి. అందులో 60 టన్నుల సామర్థ్యంతో మర ఆడించే రైసుమిల్లులు 29 కాగా 40 టన్నులవి 42, 32 టన్నులవి 28, 50 టన్నులవి 2, 4 టన్నులవి 60, 3 టన్నులవి 89, 2 టన్నులవి 68, 1 టన్నువి 4, 6 టన్నువి 3, 8,5 టన్నులవి ఒకటి చొప్పున ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో దాదాపు 14 లక్షల టన్నుల వరకు ధాన్యం సేకరణ జరుగగా వాటిని మిల్లులకు కేటాయించి 1/3 శాతంతో సీఎంఆర్ సేకరణ చేయడం ప్రభుత్వ లక్ష్యం. గడిచిన సంవత్సరాలుగా సీఎంఆర్ ఏ సీజన్ లో ఆ సీజన్ లో సేకరించిన సీఎంఆర్ సేకరణ కష్టంగా మారింది.
ధాన్యం తీసుకుంటున్న మిల్లర్లు వాటిని బహిరంగ మార్కెట్లో అమ్ముకుంటున్నారని సీఎంఆర్ కేటాయింపులకు వచ్చే సరికి రీ సైక్లింగ్ బియ్యంపై ఆధారపడుతున్నారన్న ఆరోపణలున్నాయి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 42 రైసుమిల్లులకు కేటాయించిన 155 కోట్ల బియ్యం ఇప్పటికి ఎఫ్సీఐకి అప్పగించలేదు. ఉమ్మడి జిల్లాలో కలెక్టర్లు మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని సమావేశాలు నిర్వహించడం, గడువులు పెంచడంతోనే సరిపోతుంది. కనీసం వారిని బ్లాక్ లిస్టులో చేర్చకపోవడంతో మిల్లర్లు జిల్లా కలెక్టర్ల ఆదేశాలను పట్టించుకోవడం లేదు. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఇటీవల ధాన్యం సేకరణలో 50 శాతం మాత్రమే మిల్లులకు కేటాయించి 40 శాతం ధాన్యాన్ని గోదాంలకు తరలిస్తామని ప్రకటించారు. సీఎంఆర్ ఇవ్వమని రైసుమిల్లులకు బ్లాక్ లిస్టులో పెడుతామని ప్రకటించిన జిల్లాలో మాత్రం మంత్రి ఆదేశాలకు దిక్కులేదని చెప్పాలి.
రాష్ట్రంలో అత్యధికంగా ధాన్యం పండించే జిల్లా నిజామాబాద్
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో అతిపెద్ద పరిశ్రమగా రైసుమిల్లులనే చెబుతారు. రాష్ట్రంలో అత్యధికంగా ధాన్యం పండించే జిల్లాల్లో నిజామాబాద్ ఒక్కటి. ధాన్యం సేకరణలో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండే జిల్లా ధాన్యాన్ని మిల్లింగ్ చేసి సీఎంఆర్ గా మార్చే ప్రక్రియ కోసం మిల్లర్లకు అప్పగించే వరకే గొప్పలు అన్న చందంగా పరిస్థితి ఉంది. 324 రైసుమిల్లులు ఉండగా ఇటీవల కొత్తగా 18 కొత్త రైసుమిల్లులకు సివిల్ సప్లయ్ అధికారులు అనుమతి ఇచ్చారు. ఈ నెల 16 నుంచి ధాన్యం సేకరణ ప్రారంభం కానుండగా ఆ రోజు నుంచే మిల్లర్లకు సంబంధించిన ధాన్యాన్ని అప్పగించనున్నారు.
42 మంది రైసుమిల్లర్లను డిఫాల్టర్లుగా ప్రకటించిన అధికారులు వారికి ధాన్యం కేటాయింపులు చేయడం విస్మయం కలిగిస్తోంది. ఉమ్మడి జిల్లాలో రైసుమిల్లు దందాలో ఎమ్మెల్యేలు మొదలుకుని చోటామోటా లీడర్ల వరకు వ్యాపారులు కూడా ఉన్నారు. వారిలో కొందరు సీఎంఆర్ ఎఫ్ సిఐకి అప్పగించకపోయినా ధాన్యం కొత్త కేటాయింపులు కోసం ఒత్తిళ్లు జరుగుతున్నాయని ఆరోపణలు లేకపోలేదు. ఏకంగా ప్రజాప్రతినిధులు రైసుమిల్లు అసోసియేషన్ ద్వారా ఒత్తిడి చేయిస్తుండడంతో సీఎంఆర్ ఇవ్వని వారికి కూడా ఈ రబీ సీజన్ లో ధాన్యం కేటాయించడం విమర్శలకు దారితీసింది., నిబంధనలు, నియమాలు చెప్పే ప్రభుత్వ అధికారులు మిల్లర్ల నుంచి సీఎంఆర్ వసూల్ చేయకపోవడం వెనుక మతలబు ఉందని ఆరోపణలున్నాయి.