కేంద్రీయ విద్యాలయాన్ని వర్చునల్ పద్దతిలో ప్రారంభించిన మోడీ

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా ప్రాంతంలో మినీ ట్యాంక్ బండ్ ను ఆనుకుని నూతనంగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా జరిగింది.

Update: 2024-02-20 10:33 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా ప్రాంతంలో మినీ ట్యాంక్ బండ్ ను ఆనుకుని నూతనంగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జమ్మూలోని ఐఐఎం నుండి వర్చువల్ విధానం ద్వారా కేంద్రీయ విద్యాలయ భవనానికి ప్రారంభోత్సవం చేయగా నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్, అర్బన్ శాసన సభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ,

    కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకమైన కేంద్రీయ విద్యాలయాలను ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశమంతటా విస్తరిస్తోందన్నారు. 2014 వరకు రాష్ట్రంలో కేవలం హైదరాబాద్, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాలలోనే కేంద్రీయ విద్యాలయాలు ఉండేవని అన్నారు. ప్రస్తుతం ప్రతి జిల్లా కేంద్రంతో పాటు బోధన్, మిర్యాలగూడ, మహబూబాబాద్, సిరిసిల్ల వంటి అనేక పట్టణాల్లోనూ కేంద్రీయ విద్యాలయాలు అందుబాటులోకి వచ్చాయని గుర్తు చేశారు.

    నిజామాబాద్ లో 7.5 ఎకరాల విస్తీర్ణంలో రూ. 28 కోట్లు వెచ్చిస్తూ అన్ని వసతులతో కేంద్రీయ విద్యాలయ నూతన భవనాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. పదవ తరగతి వరకు కొనసాగుతున్న ఈ విద్యా సంస్థలో త్వరలోనే 12వ తరగతి వరకు అప్ గ్రేడ్ చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే బోధన్ పట్టణంలోని కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణం పనులను కూడా మరింత వేగవంతం చేసి వచ్చే ఏడాది నుండి సొంత భవనం అందుబాటులోకి తెస్తామన్నారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయానికి ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో అన్ని వసతులతో కూడిన నూతన భవనం అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న కేంద్రీయ విద్యాలయాల ద్వారా నాణ్యమైన విద్య అందుతోందని అన్నారు. అయితే నేటి రోజుల్లో అనేక మంది తల్లిదండ్రులు తమ పిల్లలను కేవలం మార్కులు, ర్యాంకుల కోసం ఒత్తిడి చేస్తున్న పరిస్థితి నెలకొందని కలెక్టర్ ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు.

     దీనివల్ల పిల్లలు మానసిక వికాసాన్ని పెంపొందించుకోలేకపోతున్నారని, సమాజంలో మన చుట్టూ జరిగే పరిస్థితులను ఆకళింపు చేసుకోవడం లేదని అభిప్రాయపడ్డారు. మానసిక దృఢత్వం కలిగి ఉంటే, జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా అధిగమించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల దిశగా కూడా ప్రోత్సహిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు సరైన బాటలువేయాలని కలెక్టర్ హితవు పలికారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయాలలో చదువుకున్న వారు దేశభక్తిని పుణికిపుచ్చుకుంటారని అన్నారు.

    విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించాలని బోధకులకు సూచించారు. కేంద్రీయ విద్యాలయం ఆవరణలో చదువుల తల్లి సరస్వతీ మాత విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు అవసరమైన నిధులను సొంతంగా తాను సమకూరుస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కేంద్రీయ విద్యాలయ సంస్థల హైదరాబాద్ ప్రాంతీయ డిప్యూటీ కమిషనర్ మంజునాథ్, ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ మమత, విద్యార్థినీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కేంద్రీయ విద్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరింపజేశాయి.


Similar News