వందకోట్ల వివాదాస్పద భూముల మాయం..
నిజామాబాద్ నగరంతో పాటు చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో వివాదాస్పద భూములను లిటికేషన్ భూములను కాజేసిన ఒక ముఠా వ్యవహరం ఆలస్యంగా వెలుగు చూసింది.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంతో పాటు చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో వివాదాస్పద భూములను లిటికేషన్ భూములను కాజేసిన ఒక ముఠా వ్యవహరం ఆలస్యంగా వెలుగు చూసింది. నిజామాబాద్ బైపాస్ లో రాష్ట్ర మంత్రి అనుచరుల భూమిని ఫేక్ రిజిస్ట్రేషన్ లతో డాక్యుమెంట్లను తయారు చేసి అమ్మిన వ్యవహరంపై జిల్లా అధికార యంత్రాంగం పోలీసుశాఖ సీరియస్ గా తీసుకోవడంతో గతంలో పనిచేసిన ఎమ్మార్వోల సంతకాలను ఫోర్జరీ చేసి కొత్త డాక్యుమెంట్లను తయారు చేసి రిజిస్ట్రేషన్ శాఖలో చలాన్లు చెల్లించకుండా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టిన వ్యవహరం బట్టబయలు కానుంది. పోలీసులు పదిమంది సభ్యులు గల ముఠాను కీలక సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
నిజామాబాద్ నగరంతో పాటు విలీన గ్రామాల్లో వివాదాలు, ప్రభుత్వ భూములను అప్పనంగా ఎమ్మార్వోల సంతకాలను ఫోర్జరీ చేస్తూ సుమారు వందకోట్ల భూములను హాంఫట్ చేసినట్లు తెలిసింది. నిజామాబాద్ బైపాస్ రోడ్డులో గిరిరాజ్ కళాశాల వద్ద ఏడు ఎకరాల భూమికి సంబంధించిన వివాదం ఉండగా లేని వారసులను తయారు చేసి సంబంధిత ఫేక్ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహరం గతంలోనే వెలుగు చూసిన విషయం తెల్సిందే. సంబంధిత భూమిని పోలీసు అధికారులకే కట్టబెట్టి మస్క కొట్టిన గ్యాంగ్ వ్యవహరం బట్టబయలైంది. దాంతో పాటు నాగారం, బోర్గాం, బైపాస్ రోడ్డు, అర్సపల్లి, సారంగాపూర్, ధర్మపురి హిల్స్, సాయినగర్, వినాయక్ నగర్ లాంటి ప్రాంతాల్లో వివాదాస్పద భూములను ఫోర్జరీ డాక్యుమెంట్లతో డబుల్ రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలిసింది. వారికి కొందరు రెవెన్యూ శాఖలోని డిప్యూటీ తహసీల్ధార్, సర్వేయర్, విద్యుత్ శాఖలోని ఉద్యోగి సహకరించినట్లు తెలిసింది. రాజకీయంగా కీలకంగా ఉన్నవ్యక్తులు వారివెంట ఉండడంతో దశాబ్ధ కాలంగా వివాదాస్పద భూములకు రెక్కలొచ్చాయి. సంబంధిత ముఠాకు రిజిస్ట్రేషన్ శాఖలోని (సీనియర్ అసిస్టెంట్), సబ్ రిజిస్ట్రార్లు, కంప్యూటర్ ఆపరేటర్లు సహకరించినట్లు తెలిసింది.
ఇటీవల కాలంలో జిల్లారిజిస్ట్రేషన్ శాఖకార్యాలయ ఆవరణలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బోగస్ చలాన్లతో ప్రభుత్వానికి రూ.15 కోట్ల వరకు చలాన్లు చెల్లించకుండానే రిజిస్ట్రేషన్ జరిగిన వ్యవహరం మంత్రితో పాటు పోలీసు కమిషనర్ సీరియస్ గా తీసుకున్నారు. రిజస్ట్రేషన్ శాఖాధికారులు మిలాఖత్ అయి ఉండడంతో మొన్నటి వరకు పనిచేసిన కలెక్టర్ నారాయణ రెడ్డి ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని సంబంధిత గ్యాంగ్ కు చెక్ పెట్టాలని చూస్తున్నారు. ఈ గ్యాంగ్ 2009లో నిజామాబాద్ ఎమ్మార్వో కార్యాలయం రికార్డుల దహనాన్ని సొమ్ము చేసుకుంటూ ఈ తతంగాన్ని నడుపుతున్నట్లు తెలిసింది. గతంలో పని చేసిన ఎమ్మార్వోల సంతకాలను ఫోర్జరీ చేసి పట్టాలను రూపొందించడం చేసినట్లు తెలిసింది. పోలీసులు గ్యాంగ్ లో కీలక సభ్యులను అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నారు. ఇప్పటికే సంబంధిత గ్యాంగ్ వద్ద వందల సంఖ్యలో డాక్యుమెంట్లు, ఫోర్జరీ పట్టాలు, స్టాంప్ లు, స్టాంప్ పేపర్లు గుర్తించినట్లు తెలిసింది. లోతయిన విచారణలో కీలకమైన వ్యక్తులను పట్టుకునే వరకు ఈ వ్యవహరాన్ని గోప్యంగా ఉంచుతున్నట్లు తెలిసింది.