ఆడ బిడ్డలకు వరం కల్యాణలక్ష్మి
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం పెద్దింటి ఆడబిడ్డలకు వరమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు.
దిశ,బిచ్కుంద: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం పెద్దింటి ఆడబిడ్డలకు వరమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. బుధవారం బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో మండలానికి సంబంధించిన లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు లబ్ధిదారులకు అందజేశారు. పెద్ద కొడప్గల్ మండలం కాస్లబాద్ గ్రామానికి చెందిన లబ్దిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్ల చెక్కులు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద ప్రజలు అనారోగ్యానికి గురైతే ఆపద సమయంలో సీఎం సహా నిధి పథకం ద్వారా లబ్ధి పొందుతూ..మెరుగైన వైద్యం చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడి విజయవంతంగా సంవత్సరం పూర్తి అయ్యిందని అన్నారు. పేద ప్రజల,రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగిందని చెప్పారు. ఈ ఏడాది కాలంలో జుక్కల్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని,అదేవిధంగా రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందిన నియోజకవర్గాలకు ధీటుగా జుక్కల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతానని తెలిపారు. జుక్కల్ నియోజకవర్గాన్ని పర్యాటకంగా,ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నానన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల తర్వాత బిచ్కుంద మున్సిపాలిటీ ప్రకటన వెలువడుతుందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా బిచ్కుంద చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించామని అన్నారు. మద్నూర్ నుండి రుద్రూర్ మీదగా బోధన్ వరకు NH 161BB నేషనల్ హైవే నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో జుక్కల్ నియోజకవర్గాన్ని రెవిన్యూ డివిజన్ గా అప్ గ్రేడ్ చేస్తామని అన్నారు. లెండి,నాగమడుగు ప్రాజెక్టులు ఏడాది కాలంలో పూర్తి చేసి రైతులకు సాగు నీరు అందిస్తామని పునరుద్ఘాటించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు,అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని కార్యకర్తలకు సూచించారు. అనంతరం పెద్ద కొడప్గల్ మండలం పోచారం గ్రామంలో నూతనంగా మంజూరైన ప్రభుత్వ చౌకధర దుకాణాన్ని రేషన్ షాప్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ విట్టల్ రెడ్డి,బిచ్కుంద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గంగాధర్,వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.