గురుకుల పాఠశాలలో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ

ఆర్మూర్ మండలం పిప్రి సమీపంలోని వేల్పూర్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, వసతి గృహాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Update: 2024-12-04 10:44 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ డిసెంబర్ 4: ఆర్మూర్ మండలం పిప్రి సమీపంలోని వేల్పూర్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, వసతి గృహాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఒకే ప్రాంగణంలో కొనసాగుతున్న గురుకులాలను వేర్వేరుగా సందర్శించి వసతి సదుపాయాలు పరిశీలించారు. స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, కూరగాయలు, కోడిగుడ్లు, వంట నూనె, పప్పు దినుసులు, ఇతర సరుకుల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించి, మెనూ ప్రకారంగానే ఉన్నాయా? అని తనిఖీ చేశారు. ఆర్మూర్ ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి సరఫరా అవుతున్న సన్నబియ్యం నాణ్యతలో ఏమైనా తేడా ఉంటోందా అని మెస్ ఇంచార్జ్ లను ఆరా తీశారు. ఎలాంటి ఇబ్బందులు లేవని, నాణ్యమైన బియ్యం, ఇతర సరుకులు సరఫరా చేస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. భోజనం వండడానికి ముందే ప్రతి రోజు సరుకుల నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం తయారు చేసేలా చూడాలన్నారు. ఆహార పదార్థాలను స్టీల్ డబ్బాలలో భద్రపర్చి, వాటిపై తప్పనిసరిగా మూతలు భిగించాలని అన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని, ఉదయం, సాయంత్రం సమయాలలో అల్పాహారం, స్నాక్స్ అందించాలని సూచించారు. విజయ డైరీ పాలను వినియోగించాలని, రాత్రి సమయంలో ఏ.ఎన్.ఎం, వాచ్ మెన్ తో పాటు.. పర్యవేక్షణ కోసం ఒక ఉపాధ్యాయుడు తప్పనిసరిగా వసతి గృహంలోనే బస చేయాలన్నారు. నీటి సంపు, వాటర్ ట్యాంక్ లను పరిశీలించి, మిషన్ భగీరథ నీళ్లు సరఫరా అవుతున్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. నీటి సరఫరా జరుగుతున్నప్పటికీ, రెండు గురుకులాల్లోనూ ఆర్.ఓ వాటర్ ప్లాంట్లు లేవని నిర్వాహకులు తెలుపగా.. వాటిని ఏర్పాటు చేయిస్తామని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ తహశీల్దార్ గజానన్, గురుకుల పాఠశాలల నిర్వాహకులు ఉన్నారు.


Similar News