రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి.. ఎస్పీ సింధు శర్మ..

కొత్త చట్టాల పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు.

Update: 2024-09-30 11:53 GMT

దిశ, నిజాంసాగర్ : కొత్త చట్టాల పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలో సోమవారం పోలీస్ స్టేషన్ కార్యాలయంలో రికార్డులను ఆమె పరిశీలించారు. పలు కేసులకు సంబంధించిన వివరాలను ఎస్సై కే.సుధాకర్ ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్లోని సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధ్యుతులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలని ఆమె సూచించారు. డయల్ 100 ఫోన్ రాగానే స్పందించి ఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం చేకూర్చాలని సూచించారు. ప్రతిరోజు రాత్రి వేళల్లో పెట్రోలింగ్ విస్తృతంగా చేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో తరచూ వెహికిల్ చెకింగ్ నిర్వహిస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న ముఖ్యంగా ఫేక్ నెంబర్ ప్లేట్స్, నెంబర్ ప్లేట్స్ మార్పు పై ప్రత్యేక దృష్టి సారించి, కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతి వాహనాన్ని క్షుణంగా తనిఖీ చేయాలని సూచించారు.

ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తూ నివారణా చర్యలు చేపట్టాలని తెలిపారు. నేర నియంత్రణతో పాటు జరిగిన నేరాలను ఛేదించడంలో ఉపయోగపడే సిసి కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరిస్తూ, స్వచ్ఛందంగా వారి గ్రామాల్లో, ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా ఆన్లైన్ మోసాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు, పేకాట, జూదం వంటి వాటి పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఉక్కుపాదం మోపి అణిచివేయాలని పోలీసులను ఆదేశించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల పై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ డీఎస్పీ సత్యనారాయణ, ఎస్సై కే. సుధాకర్, ఏఎస్ఐ రాజేశ్వర్, హెడ్ కానిస్టేబుల్ సతీష్, సిబ్బంది పాల్గొన్నారు.


Similar News