ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులకు సూచించారు.

Update: 2024-02-22 09:02 GMT

దిశ, కామారెడ్డి : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులకు సూచించారు. ఈ నెల 28 నుండి మార్చి 19 వరకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగనున్న ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ పరీక్షల నిర్వహణపై గురువారం కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విధులు కేటాయించిన అధికారులు వెంటనే ఆయా పరీక్షా కేంద్రాలను సందర్శించి ఫర్నీచర్, విద్యుత్, మంచినీరు, వెలుతురు వంటి మౌలిక సదుపాయాలను పరిశీలించి ఏమైనా లోటుపాట్లు ఉంటే తెలిపితే తగు చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునే విధంగా ఆర్టీసీ బస్సులు

    నడిపేలా చర్యలు తీసుకోవడంతో పాటు పరీక్షా కేంద్రాలవద్ద ప్రథమ చికిత్స ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జిల్లాలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 19,509 మంది పరీక్షలు రాయనున్నారని, ఇందుకోసం 37 కేంద్రాలలో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు కొనసాగుతాయని, ఎటువంటి మాల్ ప్రాక్టీస్, దుర్వినియోగాలకు అవకాశం ఇవ్వకుండా పరీక్షలు సజావుగా నిర్వహించాలన్నారు. అధికారులకు ఇచ్చిన బుక్ లెట్ లోని మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ విద్యార్థులకు నిర్దారిత సమయంలో ప్రశ్నా పత్రాలు, జవాబు పత్రాలు అందించాలని, వాటిపై విద్యార్థులు హాల్ టికెట్ సరిగ్గా వేసేలా ఇన్విజిలేటర్ సంతకం చేసేలా చూడాలన్నారు.

     విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా చూడాలని, ఉదయం 9.00 గంటల తరువాత పరీక్షా కేంద్రానికి అనుమతించవద్దని స్పష్టం చేశారు. స్మార్ట్ ఫోన్లు, మొబైల్స్, స్మార్ట్ వాచీలు తదితర ఎలక్ట్రానిక్ గాడ్జెస్ పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబడవని అన్నారు. సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తాయన్నారు. జవాబు పత్రాలను క్లోస్డ్ కంటైనర్ లో తరలించేలా చూడాలని తపాలా శాఖకు సూచించారు. పరీక్షా కేంద్రాలకు సమీపంలో జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని, 144 సెక్షన్ అమలు చేయాలనీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం, పరీక్షల విభాగం అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు, శాఖాపర అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Similar News