అట్టహాసంగా కొటార్‌మూర్ హనుమాన్ ఆలయ ప్రారంభోత్సవం

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో గల కొటార్‌మూర్ హనుమాన్ ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా హంపి విరూపాక్ష విద్యారణ్య స్వామీజీ మంగళవారం హాజరయ్యారు.

Update: 2024-03-20 03:41 GMT

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో గల కొటార్‌మూర్ హనుమాన్ ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా హంపి విరూపాక్ష విద్యారణ్య స్వామీజీ మంగళవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా హంపి స్వామీజీని హనుమాన్ ఆలయానికి గ్రామంలో గల సత్యనారాయణ స్వామి మందిరం నుండి తీసుకురావడానికి వాహనాలను, రథాలను ఏర్పాటు చేస్తామని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రముఖులు స్వామీజీని కోరగా, హంపి స్వామీజీ వాటిని తిరస్కరించి ఉంటే ఎడ్ల బండి తీసుకురండి దానిపై వస్తానని బదులిచ్చి సున్నితంగా వాహనాలను రథాలను తిరస్కరించారు. దీంతో అక్కడి నుంచి గ్రామంలోని మహిళా మణులు మంగళ హారతులతో హంపి స్వామీజీని ఊరేగింపుగా గ్రామంలో గల హనుమాన్ ఆలయ ప్రారంభోత్సవ మందిరానికి తీసుకురాగా, హంపి స్వామీజీ కాలినడకన మందిరానికి కలిసి వచ్చారు.

ప్రారంభోత్సవ మందిర ప్రాంగణం లోనికి ప్రవేశించిన హంపి స్వామీజీ తొలుత మందిరంలో ప్రతిష్టించనున్న విగ్రహాలను, ధ్వజస్తంభ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భారీ ఎత్తున మహిళలు కుంకుమార్చన హంపి స్వామీజీ ఆధ్వర్యంలో నిర్వహించారు. హంపి విరూపాక్ష విద్యారణ్య స్వామీజీ శ్లోకాలు, ప్రవచనాలతో మంగళవారం రాత్రి కొటార్‌మూర్ హనుమాన్ ఆలయ ప్రాంగణమంతా భక్తి పారవశ్యంలో మునిగి తేలింది. ఈ సందర్భంగా హంపి విరపాక్ష విద్యారణ్య స్వామి.. కుంకుమార్చన చేస్తున్న మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. మహిళలు నిండైన అమ్మతనం ముట్టిపడేలా సంస్కృతి సాంప్రదాయాలను పాటించాలన్నారు.

మందిరాలకు దేవుడు హుందాగా తయారై హై రేంజ్ చీరలను, బంగారు ఆభరణాలను ధరించి వచ్చి పూజ చేయాలని కోరుతాడా, సాధారణ మహిళగా వచ్చి నిండు సాంప్రదాయంతో వస్తే దేవుడు పూజ చేయడానికి అంగీకరించడా అని అన్నారు. మహిళలు సింపుల్ గా ఉంటే తోటి వారు పట్టించుకోరు చీప్ గా చూస్తారు అన్న ఆలోచన విడ నాడలన్నారు. మహిళలు స్టిక్కర్స్ పెట్టుకోవడం ఏంటి అని, చేతులకు గాజులు ధరించడం లేదని, స్టిక్కర్స్‌ను అక్కడ ఇక్కడ ఎందుకు పెట్టుకోవడం, ఫేసులకు పసుపు రాసుకోవడం మరిచి అన్ని పెయింట్లు పుసుకుంటున్నారని స్వామీజీ మహిళలను ఉద్దేశించి అన్నారు. మహిళలు నిండైన అమ్మతనం ఉట్టిపడేలా నుదుటిన కుంకుమ పెట్టుకోవాలని, చేతులకు గాజులు ధరించాలని, తలలో పూలు పెట్టుకోవాలని అన్నారు. పుట్టినరోజు వేడుకల్లో క్యాండిల్స్ దీపాలను ఆర్పడం ఏం పద్ధతి అని స్వామీజీ అన్నారు.

బుధవారం ఉదయం హనుమాన్ ఆలయంలో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి ఆలయంలో విగ్రహాలను పున: ప్రాణ ప్రతిష్ట చేశారు.ఆలయంలో ధ్వజస్తంభాన్ని వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రతిష్టించారు. అనంతరం అశేషంగా హాజరైన భక్తజన బాంధవులకు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు భారీ ఎత్తున ఏర్పాటు చేసిన స్వామివారి అన్న ప్రసాదాలు పెట్టారు.ఈ కార్యక్రమంలో వేద పండితులు గోపికృష్ణ, రాజు ,గ్రామాభివృద్ధి కమిటీ కార్యవర్గ సభ్యులు ఇట్టేడి గంగారెడ్డి, గడ్డి కార్తీక్, జామ గోని తిరుపతి గౌడ్, గోపిడి సంజీవరెడ్డి, కుంట విద్యాసాగర్ గౌడ్, లక్కారం మదన్, లింబాద్రి, నక్క మహేష్ , రాజ గంగారం, సాంబారు స్వామి, తదితరులు, పూజారులు రమేష్, సాయిలు గౌడ్, అటెండర్ నక్క సాయన్న పాల్గొన్నారు.


Similar News