నిజామాబాద్ జిల్లాలో జోరుగా పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా
జిల్లాలో రేషన్ బియ్యం దందా దర్జాగా సాగుతోంది. బహిరంగంగానే లబ్ధిదారుల నుంచి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తూ పలువురు అక్రమార్కులు, రైస్‌మిల్లర్లు పెద్దఎత్తున దందా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో రేషన్ బియ్యం దందా దర్జాగా సాగుతోంది. బహిరంగంగానే లబ్ధిదారుల నుంచి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తూ పలువురు అక్రమార్కులు, రైస్‌మిల్లర్లు పెద్దఎత్తున దందా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు వ్యాపారులు జిల్లా నుంచి పక్క రాష్ట్రాలకు చౌక ధర బియ్యంను అక్రమంగా తరలిస్తున్నారు. వ్యాపారులు లబ్ధిదారుల నుంచి బియ్యాన్ని సేకరించి వాటిని రీసైక్లింగ్ చేసి అధిక ధరకు విక్రయిస్తున్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు, ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున ఉచితంగా పంపిణీ చేస్తున్న పీడీఎస్ బియ్యం అక్రమార్కుల చేతిలోకి వెళ్లిపోతోంది. పేదల నోటి ముద్దగా ఉపయోగపడాల్సిన పీడీఎస్ రైస్ బ్లాక్ మార్కెట్ లో అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని రైస్ మిల్లర్లు పీడీఎస్ బియ్యం దందాలో ఆరితేరి కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఈ దందాను అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం చోద్యం చూస్తూ లోపాయికారిగా సహకరిస్తోందనే విమర్శలు కూడా ఉన్నాయి.
జిల్లాలోని పీడీఎస్ రైస్ వ్యాపారులు యంత్రాంగాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని చేస్తున్న వ్యాపారం నిత్యకళ్యాణం పచ్చతోరణంలా సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో తమ బ్రోకర్లను ఏర్పాటు చేసుకుని లబ్దిదారుల నుంచి బియ్యాన్ని కిలో రూ. 18 లకు కొనుగోలు చేస్తున్నారు. పెద్ద యెత్తున కొనసాగుతున్న ఈ దందాను ఉమ్మడి జిల్లాలోని కొందరు అక్రమ వ్యాపారం చేసే రైస్ మిల్లర్లు సిండికేట్ గా ఏర్పడి నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. వీరే వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేసి పేదలకు పంపిణీ చేస్తున్న పిడిఎస్ బియ్యాన్ని తాము ఏర్పాటు చేసుకున్న బ్రోకర్ల ద్వారా సేకరిస్తున్నారు. సేకరించిన బియ్యాన్ని ఎక్కడికక్కడ రహస్యంగా తాత్కాలిక గోడౌన్ కు తరలించి లారీల్లో రాత్రికి రాత్రే మహారాష్ట్రకు, కర్నాటక బార్డర్ ప్రాంతానికి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలోని రైస్ మిల్లర్లు పీడీఎస్ బియ్యాన్ని సేకరించి రీసైక్లింగ్ చేసి సన్న బియ్యంగా మార్చి మార్కెట్లో అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయాలన్నీ అధికారులకు తెలిసినా అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సీఎంఆర్‌కు బదులుగా పీడీఎస్ రైస్..
ఉమ్మడి జిల్లాలో ని కొన్ని రైస్ మిల్లులు ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాల్సిన సీఎంఆర్ బియ్యాన్ని ఎగ్గొట్టిన విషయం విదితమే.. రైస్ మిల్లులు పిడిఎస్ బియ్యాన్ని సీఎంఆర్ కింద ఇచ్చి చేతులు దులుపుకునే చర్యలకు కూడా శ్రీకారం చుట్టాయని అధికారులు గుర్తించారు. బాల్కోండ నియోజక వర్గంలోని ఓ ప్రముఖ రైస్ మిల్లులో ఏడాది కాలంలో రెండు సార్లు భారీ ఎత్తున పిడిఎస్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. అయినప్పటికీ ఆ రైస్ మిల్లుల తీరు మారలేదు. అధికారుల చర్యలు తూతూ మంత్రంగా ఉంటుండడంతో రైస్ మిల్ వ్యాపారులకు అధికారుల భయం లేకుండా పోయింది. బోధన్ ప్రాంతంలోని ఓ వ్యాపారి పెద్ద యెత్తున పీడీఎస్ రైస్ అక్రమ వ్యాపారం చేస్తున్నారన్నది బహిరంగ రహస్యం. ఆ వ్యాపారి ఇప్పటికే పీడీఎస్ దందాలోనే కోట్లాది రూపాయలు సంపాదించినట్లు చెప్పుకుంటారు. వ్యాపారికి రాష్ట్ర స్థాయిలో ఉన్న రాజకీయ పలుకుబడితో ఆయనపై ఎలాంటి చర్యలకు కానీ, రైడింగులకు కానీ ఆస్కారం లేకుండా అన్ని వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారని తెలుస్తోంది. ఎమ్మెల్యేల నుంచి రాష్ట్ర మంత్రుల వరకు అన్ని విధాలుగా మేనేజ్ చేసుకుంటూ తన వ్యాపారానికి ఆటంకం లేకుండా సాగించుకుంటున్నట్లు సమాచారం.
లీకులు ఇచ్చేది వారే..
నుంచి పెద్ద మొత్తంలో పిడిఎస్ బియ్యాన్ని తరలించాలంటే పోలీసులు, టాస్క్ ఫోర్స్ అధికారుల కన్నుగప్పేందుకు అధికారులకు అక్రమార్కులు ముందస్తుగా లీకులిస్తున్నట్లు కింది స్థాయి సిబ్బంది చెబుతున్నారు. పెద్ద లారీల్లో పీడీఎస్ బియ్యాన్ని తరలించాలనుకున్న రూట్ లో పోలీస్ నిఘాను తప్పించేందుకు అదే రూట్‌లో ఏదైనా చిన్న ట్రాన్స్‌పోర్టు వెహికిల్‌లో నాలుగైదు క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం రవాణా అవుతున్న విషయాన్ని అధికారులకు చేరవేసి, వారి దృష్టి మళ్లిస్తున్నారని, పెద్ద యెత్తున రవాణా చేసే భారీ వెహికల్ ను ఏ ఆటంకం లేకుండా గమ్య స్థానాలకు చేరుస్తూ వ్యాపారాన్ని సులువుగా చేసుకుంటున్నారని చెబుతున్నారు. ఈ విషయాలన్నీ మా అధికారులకు తెలిసీ కూడా ఏం చేయలేరని, కొందరు డబ్బులకు లొంగిపోతే, మరి కొందరు అధికారానికి భయపడి ఏ చర్యలు తీసుకోవడం లేదని చెబుతున్నారు.