మార్కెట్ కమిటీలో గోల్మాల్..

తొమ్మిది నెలలుగా తమ ధాన్యం తమకు ఇవ్వడం లేదంటూ కోటగిరి మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు.

Update: 2024-09-23 14:41 GMT

దిశ, కోటగిరి : తొమ్మిది నెలలుగా తమ ధాన్యం తమకు ఇవ్వడం లేదంటూ కోటగిరి మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. పాలకుల వైఫల్యం, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల తాము నిలువు చేసుకున్న ధాన్యంని ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని, సమాధానం అడిగితే తమకు సంబంధం లేని విధంగా కోటగిరి మార్కెట్ కమిటీ సెక్రటరీ వ్యవహరిస్తున్నారని రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోటగిరికి మార్కెట్ కమిటీ గోదాంలో 41 మంది రైతులు తమకు సంబంధించిన ధాన్యాన్ని నిలువ చేసుకోగా అంతకుముందు 16 మంది రైతుల ధాన్యం నిలువ ఉంది. వీటితో పాటు ఎలాంటి పత్రాలు లేని నాలుగు వేల బస్తాల ధాన్యం ఉందని గుర్తించిన అధికారులు పంచనామా నిర్వహించి పత్రాలు లేని నాలుగువేల బస్తాలతో పాటు సదరు రైతుల ధాన్యాన్ని సైతం సీజ్ చేశారు.

దీనితో కొందరు రైతులు హైకోర్టు ని ఆశ్రయించగా హైకోర్టు సైతం రైతులకు అనుకూలంగా స్టే ఇవ్వడంతో రైతుల ధాన్యాన్ని రైతులకు తిరిగి ఇస్తామని మార్కెట్ కమిటీ జిల్లా అధికారులు 16 మంది రైతులకు సంబంధించిన వడ్లను తిరిగి ఇవ్వగా మిగిలిన 41 మంది రైతులకు సంబంధించిన వడ్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోటగిరి మార్కెట్ కమిటీ అధికారుల నుండి సరైన సమాధానం లేకపోవడంతో తమ వడ్లను తమకు ఇవ్వాలని సంబంధిత శాఖ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడంతో స్పందించిన జిల్లా అధికారులు విచారణ చేపట్టాలని కోటయ్యని మండల తహశీల్దార్ ను ఆదేశించగా సోమవారం తహశీల్దార్ గంగాధర్, మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ రావు కలిసి విచారణ చేపట్టారు.

పత్రాలను పరిశీలిస్తున్నాం - తహసీల్దార్ గంగాధర్

జిల్లా సివిల్ సప్లై అధికారుల ఆదేశానుసారం కోటగిరి మార్కెట్ కమిటీ గోదాంలో ధాన్యం నిలువ ఉంచిన 41 మంది రైతులకు సంబంధించిన పత్రాలను పరిశీలిస్తున్నామని పరిశీలన అనంతరం పూర్తి నివేదికను జిల్లా అధికారులకు పంపి రైతులకు న్యాయం చేస్తామని ఆయన అన్నారు.


Similar News