క్షుద్ర పూజల్లో కూర్చుంటే కాసులు ఇస్తామని మహిళలకు ఎర..

క్షుద్ర పూజలు చేస్తే కనక వర్షం కురుస్తుందని అమాయక మహిళల అవసరాలే టార్గెట్ గా చేసుకొని నమ్మించి మోసం చేసిన ఓ ఆరుగురు ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.

Update: 2024-09-23 16:05 GMT

దిశ, తాడ్వాయి : క్షుద్ర పూజలు చేస్తే కనక వర్షం కురుస్తుందని అమాయక మహిళల అవసరాలే టార్గెట్ గా చేసుకొని నమ్మించి మోసం చేసిన ఓ ఆరుగురు ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం తాడ్వాయి మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో డీఎస్పీ శ్రీనివాసులు మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళకు క్షుద్ర పూజలు చేస్తే రెండు కోట్ల డబ్బు వస్తుందని మాయ మాటలు చెప్పడంతో అనుమానం వచ్చిన ఆ మహిళ వారి కుటుంబ సభ్యులకు తెలపడంతో బాధితురాలు ఫిర్యాదుతో చైన్ సిస్టమ్ తో నడిపిస్తున్న ముఠాను పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తీగ లాగితే డొంక కదిలే విధంగా హైదరాబాదులో ఉంటున్న జమాల్పూర్ సాయికుమార్ అలియాస్ బాబా పూజలు చేస్తానని ఎంతో మంది మహిళలకు మాయమాటలు చెప్పి భయబ్రాంతులకు గురిచేసి డబ్బులు వసూలు చేస్తూ కాలం గడిపే వాడని అన్నారు. ఒంటరి మహిళలు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మహిళలే వారి లక్ష్యంగా ఈ ఘరానా మోసం జరుగుతుందని అన్నారు.

అనారోగ్యంతో బాధపడుతున్న ఆదిలాబాద్ కు చెందిన ఓ మహిళ అవసరాలను ఆసరాగా చేసుకుని పూజలు చేస్తే ఆరోగ్యం బాగుపడుతుందని నమ్మపలికి ఆ మహిళ నుంచి రూ,20వేల డబ్బులు వసూలు చేసి మరింత డబ్బు ఇవ్వాలని ఆమెను భయభ్రాంతులకు గురి చేశారని అన్నారు. అంతటితో ఆగక జమలాపురం సాయికుమార్ అలియాస్ బాబాను గురువుగా సంబోధిస్తూ బోధన్ కు చెందిన జైతాపుర్ కు చెందిన సత్యనారాయణ అలియాస్ సతీష్ నిజామాబాదులోని బోర్గంలో నాటు వైద్యం చేస్తూన్న సాయికుమార్ అలియాస్ బాబాకు సహకరిస్తూ క్లినిక్ ను అడ్డాగా చేసుకొని పూజలు చేయడానికి సహకరిస్తుండేవాడని తెలిపారు. వీరి మాయమాటలను నమ్మి ఎంతోమంది మహిళలు మోసపోయినట్లు వారు గుర్తించామన్నారు. మహిళలే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్న ఆరుగురు ముఠాను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఇలాంటి మోసపూరిత మూఢనమ్మకాలను నమ్మి మోసపోవద్దని వారు సూచించారు. మాయ మాటలు చెప్పి పూజలు చేస్తామని ఎవరైనా గ్రామాలలో సంచరిస్తే సంబంధిత పోలీస్ స్టేషన్లో లేదా డయల్ 100 కి సంప్రదించి వివరాలు వెల్లడించాలని తెలిపారు. సంప్రదించిన వారి వివరాలను గొప్యంగా ఉంచుతామని డీఏస్పీ శ్రీనివాస్లు వెల్లడించారు.


Similar News