కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు చేయించిన..నీచ ఘనత బీఆర్ఎస్ నాయకులదే..
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో కాంగ్రెస్ కార్యకర్తలపైనా, సమస్యల విషయంలో తమ వద్దకు వచ్చి గోడు వెళ్లబోసుకున్న ప్రజల పైనా దాడులు చేయించిన నీచమైన ఘనత ప్రశాంత్ రెడ్డిదని డీసీసీ ప్రెసిడెంట్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ నవంబర్ 27: బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో కాంగ్రెస్ కార్యకర్తలపైనా, సమస్యల విషయంలో తమ వద్దకు వచ్చి గోడు వెళ్లబోసుకున్న ప్రజల పైనా దాడులు చేయించిన నీచమైన ఘనత ప్రశాంత్ రెడ్డిదని డీసీసీ ప్రెసిడెంట్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మానాల మోహన్ రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు చేసిన విమర్శలపై ఆయన కౌంటర్ ఇచ్చారు. దాడులు చేయడం, ఇతర పార్టీ కార్యకర్తలను కేసులతో హింసించడం, భయపెట్టడం బీఆర్ఎస్ సంస్కృతి అని, కాంగ్రెస్ పార్టీ గాంధీయవాదంతో ముందుకెళ్లే పార్టీ అని, మీలాంటి నీచమైన సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి లేదని మోహన్ రెడ్డి ఘాటుగా సమాధానం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కార్యకర్తల గురించి ఆలోచించే పార్టీ అని, ఏ రోజు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు గానీ, వాగ్వాదాలకు గానీ వెళ్లలేదన్నారు. ఎవరిపైనా అక్రమ కేసులు కూడా పెట్టలేదని మానాల మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గాని ,బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గాని, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గాని ఎన్ని రకాలుగా ఎంతమందిపై అక్రమ కేసులు పెట్టారో, ఎంతమంది కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు చేయించారో మేం మర్చిపోలేని, మా వద్ద ఇప్పటికే ఆ జాబితా భద్రంగా ఉందని మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఏ ఒక్క బీఆర్ఎస్ కార్యకర్తపైనా అక్రమ కేసులు పెట్టలేదని, దాడులు కూడా జరగలేదన్నారు. ఈ విషయంపై ఎప్పుడైనా తాము బీఆర్ఎస్ నాయకులతో బహిరంగ చర్చకు సిద్ధమని మోహన్ రెడ్డి అన్నారు. చర్చకు సమయం, స్థలం మీరే నిర్ణయించి చెప్పాలని ఆయన బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరారు.
ఆర్మూర్ లో ఒక సర్పంచ్ ను తప్పుడు ఆరోపణలతో జైలుకు పంపిన నీచ చరిత్ర జీవన్ రెడ్డిదన్నారు. బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని మానాల గ్రామంలో దసరా పండుగ రోజున యువకులు తోపులాటలు చేసుకుంటే దాన్ని కూడా రాజకీయం చేసి ఎస్సీ ,ఎస్టీ కేసులు పెట్టించిన నీచ చరిత్ర నీది కాదా ప్రశాంత్ రెడ్డీ అని నేరుగా బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని మీడియా ముఖంగా మోహన్ రెడ్డి ప్రశ్నించారు. మీరు పాలెం గ్రామానికి వెళ్లిన సందర్భంలో అదే గ్రామానికి చెందిన ఒక ఒక రైతు మా గ్రామానికి పని కావాలని మీ దగ్గరికి వస్తే మీ అనుచరులతో అతనిపై దాడి చేయించి కేసులు పెట్టించి జైల్లో పెట్టిన నీచ ఘనత నీది కాదా అని ప్రశ్నించారు. ముప్కాల్ గ్రామంలో తండ్రి కొడుకుల పై గంజాయి కేసు పెట్టించావు. బాల్కొండలో ఇఫ్తార్ విందుకు వస్తున్న సందర్భంలో తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన మైనారిటీ సోదరులపై అక్రమ కేసులు పెట్టించలేదా అని ప్రశాంత్ రెడ్డిని మానాల ప్రశ్నించారు. అధికారంలో ఉన్న పదేళ్లు రౌడీయిజం, దౌర్జన్యాలు చేసిన ప్రశాంత్ రెడ్డి అక్రమ కేసులు, వేధింపుల గురించి మాట్లాడటం దెయ్యం వేదాలు వళ్లిస్తున్నట్టు ఉందని మానాల మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజాపాలన నడుస్తోందని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రాక్షస పాలన నడిచిందన్నారు. ఎమ్మెల్యే తప్ప ఏ వ్యక్తి కూడా అధికారుల దగ్గరికి వెళ్లడానికి భయపడే వారని, ప్రస్తుతం ఎవరైనా సరే అధికారుల దగ్గరికి వెళ్లి పని చేయించుకుంటున్నారని మోహన్ రెడ్డి అన్నారు. ప్రజాపాలనకు, రాక్షస పాలనను ఇదే తేడా అన్నారు. గతంలో కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించి తమ పార్టీలోకి లాక్కున్న వ్యక్తి ప్రశాంత్ రెడ్డని మోహన్ రెడ్డి విమర్శించారు. 25 రోజులుగా ప్రశాంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు అబద్ధాలాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాలకు బోనస్ ఇవ్వదని బీఆర్ఎస్ నాయకులు చెప్పడంతో రైతులు ఆందోళనకు గురై వడ్లను ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకున్నారని ఆరోపించారు. ఇప్పుడు బోనస్ వస్తున్న సందర్భంలో నష్టపోయామని రైతులు బాధపడుతున్నారన్నారు. తన తప్పుడు స్టేట్ మెంట్లతో రైతుల నష్టానికి ప్రశాంత్ రెడ్డి బాధ్యత వహించాలన్నారు. ప్రజలకు సేవ చేయడం, అభివృద్ధి ఫలాలు అందించడమే కాంగ్రెస్ పార్టీ ముందున్న లక్ష్యాలని మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు గ్రామ సింహాలవలే ఎంత మొరిగిన పట్టించుకునేది లేదని తేల్చి చెప్పారు. ప్రజలకు తాము చేయాల్సిన మేలు చేసే తీరుతామని మానాల మోహన్ రెడ్డి అన్నారు.
కేసీఆర్ ప్రజలను విదేశాలకు పంపుతానని బ్రోకర్ పనీ చేస్తే గురువుకు తగ్గ శిష్యుడిగా ఆర్మూర్ జీవన్ రెడ్డి ఇంకోరకంగా బ్రోకరిజం చేశాడని ఎద్దేవా చేశారు. బ్రోకర్ పనులు మీరు చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులను బ్రోకర్లు అనడానికి సిగ్గుండాలని అన్నారు. కాంగ్రెస్ నాయకులపై గాని, పార్టీపై గాని విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని మానాల మోహన్ రెడ్డి ఘాటుగా హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న దీక్ష దివస్ అనేది ఒక దొంగ దీక్ష అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావడానికి ముఖ్య కారణం ఎంతోమంది యువకులు ప్రాణాలు అర్పించడంతో పాటు, తెలంగాణ ప్రజల కష్టాలను చూసి సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ సాకారమైందన్నారు. ప్రజల కోరిక మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందే తప్ప, కేసీఆర్ చేసిన దొంగ దీక్ష వల్ల కాదన్నారు. కేసిఆర్ దీక్ష సమయంలో ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఏమేమి తిన్నాడో ప్రజలందరికీ తెలుసన్నారు. బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నది దీక్ష దివస్ కాదని దొంగ దీక్ష దివాస్ అని మానాల మోహన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి ,రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ జావీద్ అక్రమ్, జిల్లా ఎన్ ఎస్ యూ ఐ అధ్యక్షులు వేణురాజ్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు రాజనరేందర్ గౌడ్, మాజీ బీసీ సెల్ అధ్యక్షులు శేఖర్ గౌడ్ ,జిల్లా ఫిషర్ మన్ చైర్మన్ శ్రీనివాస్, నగర ఎస్టీ సెల్ అధ్యక్షులు సుభాష్ జాదవ్ ,రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ నర్సింగ్ రావు, సాయికుమార్ పాల్గొన్నారు.