ఈదురు గాలులు, రాళ్ల వర్షానికి అపార నష్టం

ఈదురు గాలులతో కూడిన రాళ్ల వర్షం రైతన్నను అష్ట కష్టాల పాలు చేసింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలన్నీ ఒక్కసారిగా నేలరాలాయి. చేతికొచ్చే దశలో పంటలు పూర్తిగా నేలమట్టమయ్యాయి.

Update: 2024-03-17 04:15 GMT

దిశ, కామారెడ్డి : ఈదురు గాలులతో కూడిన రాళ్ల వర్షం రైతన్నను అష్ట కష్టాల పాలు చేసింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలన్నీ ఒక్కసారిగా నేలరాలాయి. చేతికొచ్చే దశలో పంటలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. వరి, మొక్కజొన్న పంటలతో పాటు కూరగాయ పంటలైన టమాట, వంకాయ, బీర, పచ్చిమిర్చి తదితరులు, ఆకుకూరలు, ఉల్లి గడ్డ ఈదురుగాలులు, రాళ్ల వర్షాలతో పూర్తిగా దెబ్బతిన్నాయి. అలాగే చెట్లు నేలకూలాయి. కోళ్ల ఫారాల్లోని కోళ్లు మృతి చెందాయి. కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి మండలం నరసన్నపల్లి, కొట్టాలపల్లి, లింగాయపల్లి, తిమ్మక్ పల్లి, చిన్న మల్లారెడ్డి తదితర గ్రామాల్లో రాళ్ల వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. అలాగే భిక్కనూర్, రాజంపేట, రామారెడ్డి మండలాల్లో కూడా రాళ్ల వర్షంతో పంటలు దెబ్బతిన్నాయి.

ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల వేడుకోలు..

పంటలు చేతికొచ్చే దశలో పూర్తిగా దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అధికారులతో పంట నష్టాన్ని అంచనా వేయించి తగిన ఆర్థిక సహాయం అందించేలా కృషి చేయాలని కోరుతున్నారు. లేదంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన చెందుతున్నారు.


Similar News