తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఈటల హాట్ కామెంట్స్

ధరణి పోర్టల్ కేసీఆర్ కోసం, ఆయన కుటుంబం కోసం, ఆయన చెంచాల కోసమే పని చేస్తుందని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు.

Update: 2022-09-29 10:43 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ధరణి పోర్టల్ కేసీఆర్ కోసం, ఆయన కుటుంబం కోసం, ఆయన చెంచాల కోసమే పని చేస్తుందని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. గురువారం ఆయన ధరణి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి చేపట్టిన 3 వ రోజు ఆమరణ దీక్షకు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డితో కలిసి సంఘీభావం ప్రకటించారు. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వంతో పోరాడి సమస్య పరిష్కారానికి కృషి చేయడానికి అందరం కలిసికట్టుగా పోరాడుదామని, దానికోసం దీక్ష విరమించాలని వెంకట రమణారెడ్డికి సూచించి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఈటల హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ధరణితో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో దేశంలోనే ధరణి మంచి ఫలితం సాధిస్తుందని ఈ పోర్టల్ ను సీఎం కేసీఆర్ తెచ్చారని, కానీ ధరణి సమస్యలపై ఇప్పటికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ పోర్టల్ ద్వారా వస్తున్న సమస్యలు చూసి ఇది వద్దని కలెక్టర్ల సదస్సులో తాను సీఎంకు చెప్పినా పట్టించుకోలేదన్నారు.

కేసీఆర్ ఎవరి మాట వినేరకం కాదని, ఎమ్మెల్యేలు, మంత్రుల మాట అస్సలు కేర్ చేయరని, కలెక్టర్లు సీఎంకు చెప్పేంత దుస్సహాసం చేయరని పేర్కొన్నారు. దేశంలోనే ఒక ఎమ్మార్వో మీద పెట్రోల్ పోసి చంపే నీచ సంస్కృతికి తెలంగాణలో తెర లేపారన్నారు. వీఆర్ఓ వ్యవస్థ తీసేసి మెరుగైన పరిష్కారం చూపిస్తామన్న సీఎం వీఆర్ఓ వ్యవస్థను, రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. హైదరాబాద్ చుట్టూ వారసులు లేని భూముల వివరాలు తెప్పించుకుని ధరణి పోర్టల్ ద్వారా సెటిల్మెంట్లు చేస్తూ వేల కోట్ల సంపాదనకు ప్లాన్ చేశారన్నారు.

తన భూమి ఉంటుందో పోతుందో అని రైతులు బిక్కుబిక్కుమంటూ గడిపే పరిస్థితి కేసీఆర్ హయాంలోనే ఉందని విమర్శించారు. సీఎం, ప్రగతి భవన్ కు సంబందించిన చెంచాలు, నమ్మకస్తుల పనులు సెటిల్మెంట్ల ద్వారా క్షణాల్లో అయిపోతాయని వ్యాఖ్యానించారు. రైతాంగానికి నేడు ఉచితంగా దరఖాస్తు చేసుకునే పరిస్థితి లేదన్న ఆయన, ఒక రైతు పదిసార్లు దరఖాస్తు చేస్తే 10 వేలు ఖర్చవుతున్నాయన్నారు.

హైదరాబాద్ చుట్టూ 5600 ఎకరాలు, 50 వేల కోట్ల భూములను ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారని, ఈ భూములను బినామీల పేరిట ఉన్న కంపెనీలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలు గట్టిగా ఉంటే తట్టుకోలేమని వారిని మింగేశారన్నారు. తాను అసెంబ్లీకి వస్తే ఇవన్నిటిపై ప్రశ్నిస్తానని నన్ను రాకుండా చేస్తున్నారని తెలిపారు. అరెస్టులు చేస్తూ వారిని ఇంటిదగ్గరే దిగబెట్టే కొత్త సంస్కృతి మొదలైందని, మొన్న తనను అరెస్ట్ చేసి నేరుగా పోలీస్ వాహనంలోనే ఇంటిదగ్గరే దిగబెట్టారని, నేడు వెంకట రమణారెడ్డిని అరెస్ట్ చేసి ఇంటివద్ద వదిలేసారన్నారు.

Tags:    

Similar News