పోషణ భారం కావడంతో కాలువతో నెట్టి హత్య

పోషించే స్థోమత లేక మనుమడిని వరద కాలువలో పడేసి హత్య చేసిన నానమ్మ కు జీవిత కారాగార శిక్ష విధిస్తూ నిజామాబాద్ సెషన్స్ జడ్జి సునీత కుంచాల బుధవారం తీర్పు వెలువరించారు.

Update: 2024-02-28 11:46 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : పోషించే స్థోమత లేక మనుమడిని వరద కాలువలో పడేసి హత్య చేసిన నానమ్మ కు జీవిత కారాగార శిక్ష విధిస్తూ నిజామాబాద్ సెషన్స్ జడ్జి సునీత కుంచాల బుధవారం తీర్పు వెలువరించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని పెద్దమ్మ కాలనీకి చెందిన గంగవ్వ కుమారుడు గంగాధర్ కు మూడున్నరేళ్ల కుమారుడు లక్కీ కలడు. గంగవ్వ చిత్తుకాగితాలు ఏరుకుంటూ జీవిస్తుంది. ఆమె భర్త చాలా రోజుల క్రితమే చనిపోయాడు. ఆమెకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. పెద్ద కొడుకు గంగాధర్ తన భార్య గంగమ్మని దాంపత్య విషయంలో తలపై ఇటుకతో కొట్టి చంపినాడనే అభియోగాలతో జైలుకు వెళ్లి, బెయిలు పై తిరిగి వచ్చాడు.

    ఈ నేపథ్యంలో గంగాధర్ కొడుకు మూడున్నరేళ్ల లక్కీ ని పోషించేది. పోషించడం భారం కావడంతో ఆ బాలుడిని చంపాలని పథకం రచించింది. కొడుకు గంగాధర్ లేని సమయంలో 10 మే 2023న మధ్యాహ్నం రెండు గంటలకు చిత్తు కాగితాలు ఏరుకోవడానికని మనువడిని వెంట తీసుకునివెళ్లి కమ్మర్ పల్లి గ్రామ శివారులోని ఉప్లూర్ గ్రామానికి వెళ్లే రహదారిలో గల వరద కాలువలో లక్కీ ని పడేసింది. దాంతో నీటిలో బాలుడు ఊపిరాడక మరణించాడు. దాంతో కమ్మర్ పల్లి పోలీస్ లు మృతుని నానమ్మ గంగవ్వపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచారు. విచారణ లో ఆమె నేరం చేసినట్టు నిరూపణ కావడంతో సెషన్స్ జడ్జి సునీత జీవితఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవిరాజు ప్రాసిక్యూషన్ నిర్వహించారు. పీపీకి సహాయకారులుగా కమ్మర్ పల్లి పోలీస్ స్టేషన్ పోలీస్ కానిస్టేబుల్ రామారావు ఉన్నారు.


Similar News