మత్తు పదార్థాల నిరోధం ప్రతి ఒక్కరి బాధ్యత

మత్తు పదార్థాల నిరోధానికి కలిసికట్టుగా కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.

Update: 2024-02-24 14:02 GMT

దిశ, కామారెడ్డి: మత్తు పదార్థాల నిరోధానికి కలిసికట్టుగా కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం జిల్లా స్థాయి మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. దేశ భవిష్యత్తుకు కీలకమైన యువత, విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తుందని మత్తు పదార్థాలు రవాణా కాకుండా చూడాలన్నారు. జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం, రవాణా తదితర అంశాలపై సమావేశంలో చర్చించి వాటిని నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలను వివరించారు. సమాజానికి పెను ప్రమాదకరంగా మారిన మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి వాటికి బానిసలుగా మారిన వారు వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా నష్టపోతారని చెప్పారు. మాదక ద్రవ్యాల వినియోగంతో దుష్పరిణామాల పై యువతకు అవగాహన కల్పించేందుకు విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టాలని కోరారు. సమావేశంలో జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ అధికారి బావయ్య, జిల్లా వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి, జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్ రెడ్డి, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం, విద్య, వైద్యం, ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు.


Similar News