అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి.. ఎంపీ ధర్మపురి అర్వింద్

ప్రజలకు ఉపయోగకరంగా ఉండిపోయే అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయించేందుకు అధికారులు పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ సూచించారు.

Update: 2024-09-28 10:29 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ప్రజలకు ఉపయోగకరంగా ఉండిపోయే అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయించేందుకు అధికారులు పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో శనివారం ఎంపీ అర్వింద్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో వివిధ శాఖల ద్వారా చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ప్రగతి పై ఎజెండా అంశాల వారీగా సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఆయా ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ఎనలేని తాత్సారం జరుగుతోందని అన్నారు.

మాక్లూర్ మండలం అడవిమామిడిపల్లి వద్ద రోడ్డు నిర్మాణంతో పాటు ఆయా చోట్ల రహదారుల నిర్మాణ పనులు మందకొడిగా సాగుతున్నాయని అన్నారు. ఈ పెండింగ్ పనుల విషయమై చర్చించేందుకు అక్టోబర్ రెండవ వారంలో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. సంబంధిత శాఖల అధికారులందరూ ఈ సమావేశానికి హాజరయ్యేలా చూడాలన్నారు. సకాలంలో పనులు పూర్తయి ప్రజలకు వసతులు అందుబాటులోకి వచ్చేలా అధికారులు చొరవ చూపాలని హితవు పలికారు. వివిధ పథకాల కింద కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన ఆయా పనులు ఏ దశల్లో కొనసాగుతున్నాయి. వెచ్చించిన నిధుల వివరాలను తెలుపుతూ సమగ్ర నివేదికలు తనకు సమర్పించాలని ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, జాతీయ రహదారులు, ఫారెస్ట్ తదితర శాఖల అధికారులను ఆదేశించారు. విద్యాశాఖకు సంబంధించి కేంద్రం ద్వారా మంజూరైన నిధుల గురించి ఎంపీ ప్రశ్నించగా, పీఎంశ్రీ పథకం కింద జిల్లాలో 40 పాఠశాలలకు కేంద్రం ద్వారా రూ. 20 కోట్ల నిధులు మంజూరయ్యాయని, వాటిని అదనపు తరగతి గదుల నిర్మాణాలు, లైబ్రరీలు, ప్రయోగశాలలు, క్రీడా పరికరాలు, మైదానాల అభివృద్ధి కోసం వెచ్చిస్తున్నామని డీఈఓ దుర్గాప్రసాద్ తెలిపారు. అదేవిధంగా అమృత్ పథకం కింద జిల్లాలోని నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీలకు రూ. 335 కోట్ల నిధులు మంజూరయ్యాయని ప్రజారోగ్య శాఖ ఈఈ తిరుపతి కుమార్ ఎంపీ దృష్టికి తెచ్చారు.

ఈ నిధులతో తాగునీటి సరఫరా వ్యవస్థను మరింతగా మెరుగుపరుస్తున్నామని, భూగర్భ డ్రైనేజీ పెండింగ్ పనుల పూర్తికి కూడా అమృత్ పథకం నిధులను వెచ్చిస్తున్నామని అన్నారు. అటవీ శాఖకు 'కాంపా' పథకం ద్వారా మంజూరైన నిధులను సక్రమంగా వెచ్చిస్తూ పచ్చదనాన్ని పెంపొందించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఎంపీ అర్వింద్ ఫారెస్ట్ అధికారులకు సూచించారు. పీఎం విశ్వకర్మ పథకం అమలు తీరు గురించి ఎంపీ ఆరా తీయగా, జిల్లాలో 23,583 మంది దరఖాస్తులు చేసుకున్నారని, నల్గొండ తరువాత నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో ఉందని పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ సురేష్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు 2592 మందికి శిక్షణ కూడా పూర్తి చేశామని వివరించారు. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రోటోకాల్ పాటించడం లేదని ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్ రెడ్డి సమావేశంలో ఆక్షేపణ తెలిపారు. దీని పై ఎంపీ స్పందిస్తూ, ప్రొటోకాల్ ఉల్లంఘన జరుగకుండా అధికారులు సంబంధిత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు తప్పనిసరి ముందస్తుగానే తగిన సమాచారం అందించాలని అన్నారు. ప్రజాప్రతినిధుల గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజనీర్ కు సన్మానం..

రోడ్లు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ హన్మంత్ రావు పదవీ విరమణ చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని దిశా సమావేశం ముగిసిన అనంతరం ఎంపీ అర్వింద్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయనను ఘనంగా సన్మానించారు. సుమారు 38 సంవత్సరాల పాటు హన్మంత్ రావు అందించిన సేవలను కొనియాడారు. సుదీర్ఘ కాలం పాటు విధులు నిర్వర్తించిన సందర్భంగా ఎదురైన అనుభవాలను హన్మంత్ రావు ఈ వేదికగా పంచుకున్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, డీఆర్డీఓ సాయాగౌడ్, వివిధ శాఖల అధికారులు, దిశా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


Similar News