చికెన్ ఆర్డర్ పేరుతో సైబర్ మోసం..చివర్లో తప్పించుకున్న యజమాని
సైబర్ క్రైమ్ నేరగాళ్ల ఉచ్చులో నుంచి సేఫ్ గా చికెన్ సెంటర్ యజమాని బయటపడ్డ వైనం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది.
దిశ, భిక్కనూరు :సైబర్ క్రైమ్ నేరగాళ్ల ఉచ్చులో నుంచి సేఫ్ గా చికెన్ సెంటర్ యజమాని బయటపడ్డ వైనం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...పట్టణంలోని రామేశ్వర్ పల్లి దారిలో ఉన్న చికెన్ సెంటర్ కు డాక్టర్ రాజిరెడ్డి పేరున 70 కిలోల చికెన్ కావాలని ఫోన్ చేసి ఆర్డర్ చేశాడు. పలానా శ్రీనివాస్ అనే వ్యక్తిని పంపిస్తానని అతనికి ఇవ్వాలని చెప్పగా.. అడ్వాన్స్ పేమెంట్ చేయాలని, సదర్ యజమాని ఆర్డర్ చేసిన వ్యక్తిని ప్రశ్నించాడు. సినిమా టాకీస్ చౌరస్తాలోని ఫలానా మెడికల్ షాప్ కు ఎదురుగా ఉన్న ఇంటర్నెట్ సెంటర్ కు వెళితే అడ్వాన్స్ అక్కడ ఇస్తాడని చెప్పడంతో..ఆ మోసగాడి మాటలు నమ్మి అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్లిన తరువాత ఆర్డర్ చేసిన వ్యక్తికి ఫోన్ చేయగా..20వేల రూపాయలు ఉల్టా తనకు ఫోన్ పే గాని, గూగుల్ పే గాని చేయాలని తెలిపారు. అడ్వాన్స్ పంపిస్తానని చెప్పి,చికెన్ ఆర్డర్ చేసిన వ్యక్తి, మళ్లీ తనకు డబ్బులు పంపించాలని ఉల్టా అడగడం ఏమిటని అనుమానం వచ్చి..ఒక్కసారిగా షాక్ కు గురై వెంటనే ఫోన్ కట్ చేశాడు. ఏమాత్రం ఏమరుపాటు తో ఉన్నా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో మోసపోయి ఉండేవాడినని గ్రహించి షాక్ లో నుంచి కొద్దిసేపు తేరుకోలేకపోయాడు. ఇదివరకు ఒకసారి మిలిటరీ మ్యాన్ అని చెప్పి, ఫోన్ చేసి 20 కిలోల చికెన్ ఆర్డర్ చేశాడు. వెంటనే చికెన్ కొట్టి రెడీ చేసి ఉంచి, ఫోన్ లో లైవ్ గా ఆర్డర్ చేసిన వ్యక్తికి చూపించాడు. వారు చెప్పిన అడ్రస్ కు ఆర్డర్ ఇచ్చిన చికెన్ ను పంపించడానికి అమౌంట్ పే చేయాలని ఫోన్ చేసి అడుగగా.. ఇదే పరిస్థితి రిపీట్ అవ్వడంతో జాగ్రత్తగా తప్పించుకోవడం ఆ యజమానికి ఇది రెండవసారి.