డబుల్ ఇళ్లకు పట్టాలు ఇవ్వాలని ఆందోళన
డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయించినా పట్టాలివ్వడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని బాధితులు కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ఆందోళన చేపట్టారు.
దిశ, కామారెడ్డి : డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయించినా పట్టాలివ్వడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని బాధితులు కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ఆందోళన చేపట్టారు. కామారెడ్డి మున్సిపాలిటీలోని రాజీవ్ నగర్, రామేశ్వర్ పల్లి, దేవునిపల్లి డబుల్ బెడ్ రూంలలో నివాసం ఉంటున్న వారు కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ధర్నాచౌక్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమకు ప్రభుత్వం ఇళ్లు కేటాయించినా వసతులు కల్పించడం లేదన్నారు. ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి కలెక్టర్ సుముఖంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. తమకు పట్టాలు ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు. పోలీసులు నచ్చజెప్పినా వినిపించుకోలేదు. దీంతో కామారెడ్డి ఆర్డీఓ శ్రీనివాస్ రెడ్డి ఆందోళన చేస్తున్న వారి వద్దకు వచ్చి మాట్లాడారు. తనకు వారం రోజులు సమయం ఇవ్వాలని ఆలోపు పట్టాలు ఇప్పిస్తానన్నారు. రెండు రోజుల్లో తమ సిబ్బంది వచ్చి ఇంటింటికి తిరిగి ఫోటోలు, వివరాలు సేకరిస్తారని తెలిపారు. దీంతో ఆందోళన విరమించారు.