Traffic Police : బైక్ ఒకరిది.. ఫైన్ మరొకరికి..

వాహనాలకు ఫైన్లు వేసే విషయంలో కామారెడ్డి పోలీసుల తీరు విమర్శలకు అవకాశమిస్తోంది.

Update: 2024-07-23 09:23 GMT

దిశ, కామారెడ్డి : వాహనాలకు ఫైన్లు వేసే విషయంలో కామారెడ్డి పోలీసుల తీరు విమర్శలకు అవకాశమిస్తోంది. హెల్మెట్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశిస్తున్నా కొందరు పెడచెవిన పెడుతుండటంతో పోలీసులు ఫైన్లు విధిస్తున్నారు. ఇది వారి విధుల్లో భాగమే అయినా ఒకరికి బదులుగా మరొకరికి ఫైన్ వేయడమే వాహనదారుల ఆగ్రహానికి కారణం అవుతోంది. తాజాగా రామారెడ్డి మండలం రెడ్డి పేట గ్రామానికి చెందిన బండ సురేందర్ రెడ్డి తన వాహనం పై ఉన్న చలాన్లను ఆన్లైన్ పోర్టల్ లో చెక్ చేసుకున్నాడు. అతని బైకు పై మొత్తం 705 రూపాయల ఫైన్లు పెండింగులో ఉండగా ఎక్కడెక్కడ పడ్డాయో చెక్ చేస్తుండగా ఇతరుల బైక్ ఫైన్ తన బైక్ పై పడిందని గుర్తించాడు. గత ఏప్రిల్ 15 న TS17A1577 నంబరు గల బైక్ కొత్త బస్టాండ్ ప్రాంతంలో హెల్మెట్ లేకుండా వెళ్తున్నారని 135 రూపాయల ఫైన్ విధించారు పోలీసులు.

అయితే ఆ రోజు ఆ బైకు కామారెడ్డికి వెళ్ళలేదు. పైగా ఆ బైకు నంబర్ TS17A5177 కావడంతో ఖంగుతిన్నాడు. ఫొటోలో ఉన్న బైకు నంబర్ కూడా సరిగా చూసుకోకుండా నంబర్ అటు ఇటుగా చేసి ఇష్టం వచ్చిన వారికి ఎలా ఫైన్ వేస్తారని బాధిత వాహనదారుడు ప్రశ్నిస్తున్నాడు. మిగతా మూడు ఫైన్లు తాను చెల్లిస్తానని తనది కాని ఫైన్ ఎవరు చెల్లించాలి అని ప్రశ్నిస్తున్నాడు. గతంలో కూడా పోలీసులు ఇలా ఒకరికి బదులుగా మరొకరికి చలాన్ విధించిన ఘటనలు చాలా ఉన్నాయి. కొందరు వాహనదారులు చూసుకుని చలాన్ చెల్లిస్తుండగా మరికొందరు తమది కాని వాహన ఫైన్లు కూడా చెల్లించిన సందర్భాలు ఉన్నాయి. ఇకనైనా పోలీసులు నిబంధనలు పాటించని వారికి మాత్రమే నంబర్ సరిగ్గా చూసుకుని ఫైన్ వేయాలని వాహనదారులు కోరుతున్నారు.

Tags:    

Similar News