60 ఏళ్లలో రైతులకు కాంగ్రెస్ చేసిందేమీ లేదు

60 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ రైతుల అభివృద్ధికి ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదని, రైతుల కోసం ఆ పార్టీ చేసిందేమీ లేదని పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ అన్నారు.

Update: 2024-02-28 13:46 GMT

దిశ, ఆర్మూర్ : 60 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ రైతుల అభివృద్ధికి ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదని, రైతుల కోసం ఆ పార్టీ చేసిందేమీ లేదని పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ అన్నారు. ఆర్మూర్ లోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఎంపీ అరవింద్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రచారం చేసి ప్రజలను మోసం చేసిందని, వాగ్దానాలు చేసి ప్రస్తుతం అమలు కోసం సతమతమవుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ పేదలకు ఇల్లు ఇవ్వదన్నారు. పసుపు విస్తీర్ణం తగ్గినందున మార్కెట్లో గిట్టుబాటు ధర లభిస్తుందని కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేయడం వారి అవివేకానికి నిదర్శనం అన్నారు. దేశంలో మోడీని, నిజామాబాద్ లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆర్మూర్ ప్రజలకు ఎంపీ అరవింద్ విజ్ఞప్తి చేశారు.

     దేశ ప్రజలు ప్రధాని మోడీ పట్ల చూపిస్తున్న ఆదరాభిమానాలకు ధన్యవాదాలు తెలిపారు. యాత్రలో భాగంగా పసుపు రైతులతో సమావేశమై సాధక బాధకాలను తెలుసుకుంటామన్నారు. రెండు దశాబ్దాలుగా పసుపు రైతులకు ఇబ్బందులకు, షుగర్ ఫ్యాక్టరీ మూసివేతకు కాంగ్రెస్ కారణం అన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో తీవ్రవాదాన్ని పెంచి పోషించిందని, కాశ్మీర్ ను కల్లోలం చేసిందని, ఈశాన్య రాష్ట్రాల్లో కలహాలు రేపిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఏ మేరకు ప్రభావాన్ని చూపెట్టాలో శాసనసభ ఎన్నికలలో ప్రభావం కనబరచకపోవడంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఈసారి జరిగే లోక్ సభ ఎన్నికలలో బీజేపీకి భారీ మెజార్టీ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

    కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ప్రజల ఆదరణ తగ్గుతుందన్నారు. రాబోయే రోజుల్లో నిజామాబాద్ లో పసుపు బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రధాని మోడీ దేశంలో మూతపడ్డ 66 చక్కెర ఫ్యాక్టరీలను తిరిగి ప్రారంభించారన్నారు. రాష్ట్రంలోని ఆదాయాన్ని దక్షిణ తెలంగాణ జిల్లాలకే అక్కడి ప్రజాప్రతినిధులు తరలించుకుపోతున్నారని విమర్శించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చలో కొడంగల్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారని, దానికి బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. బోధనలో జరిగే ముగింపు సమావేశానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ పాల్గొంటారని వివరించారు.

కొడంగల్ లో ఆమరణ దీక్ష చేస్తా : ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి..

ఆర్మూర్ నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయక వివక్ష చూపడాన్ని నిరసిస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ కు నిధులు మంజూరు చేసినట్లు ఆర్మూర్ కు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనియెడల కోడంగల్ కేంద్రంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు.

    తాను చేసే దీక్షకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, యాత్ర ఇన్చార్జి రామనాథ్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గంగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు దినేష్, నియోజకవర్గ కన్వీనర్ పాలెపు రాజు, మున్సిపల్ మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు నూతుల శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జీవి. నరసింహ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఉదయ్, నాయకులు కలిగొట గంగాధర్, ఆకుల శ్రీనివాస్, ఆకుల రాజు, డమాంకర్ శ్రీనివాస్, యాల్ల రాజ్ కుమార్, కేసి ముత్తన్న, కొట్టాల సుమన్ పాల్గొన్నారు.


Similar News