'నియోజకవర్గంలో ఇక అరాచకాలు, దోపిడీ, దౌర్జన్యాలు ఉండవు'
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఏర్పాటు కాబోతున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, బాల్కొండ నియోజకవర్గంలో ఇక అరాచకాలు ఉండవని, దోపిడీ ఉండదని దౌర్జన్యాలు ఉండవని, గంజాయి ఉండదని అవినీతి చేయాలని చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నేను చూస్తూ ఊరుకోమని బాల్కొండ కాంగ్రెస్ నియోజకవర్గ నాయకుడు ముత్యాల సునీల్ కుమార్ అన్నారు.
దిశ, ఆర్మూర్ : తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఏర్పాటు కాబోతున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, బాల్కొండ నియోజకవర్గంలో ఇక అరాచకాలు ఉండవని, దోపిడీ ఉండదని దౌర్జన్యాలు ఉండవని, గంజాయి ఉండదని అవినీతి చేయాలని చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నేను చూస్తూ ఊరుకోమని బాల్కొండ కాంగ్రెస్ నియోజకవర్గ నాయకుడు ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. సోమవారం బాల్కొండ నియోజకవర్గంలోని ముప్కాల్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముత్యాల సునీల్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు అహర్నిశలు కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు ఓట్లు వేసిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరుతుందని ఇక ప్రజా సంక్షేమ పాలన రాబోతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను తప్పక అమలు చేస్తుందని నేరుగా పథకాలు ప్రజలకు అందుతాయని తెలిపారు. ప్రజలను ఎవరైనా ఇబ్బంది పెడితే తనకు తెలపాలని ప్రజలకు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బానిసత్వం ఉండదని ప్రజలు స్వేచ్ఛగా తమకు కావాల్సిన పనులు చేసుకోవచ్చనీ, ప్రజల ఆదాయాన్ని పెంచే పథకాలను ప్రభుత్వం తీసుకొస్తుందనీ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సుపరిపాలనతో ప్రజలు సంతోషంగా ఉంటారని తెలిపారు. అరాచకం, దోపిడీ, అన్యాయం, అవినీతి చేయాలనుకునేవారు మూటాముల్లె సర్దుకొని నియోజకవర్గం నుంచి వెళ్లిపోవాలని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.