చాకలి ఐలమ్మ పోరాటం నేటి యువతకు స్ఫూర్తిదాయకం - జుక్కల్ ఎమ్మెల్యే

Update: 2024-09-26 12:27 GMT

దిశ, మద్నూర్: బిచ్కుంద మండల కేంద్రంలో గురువారం చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకల్లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పాల్గొన్నారు. ముందుగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భూమి కోసం,భుక్తి కోసం,వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటిచెప్పి, మహిళా లోకానికి స్పూర్తినిచ్చిన ఆమె గొప్పతనాన్ని ప్రజలకు వివరించారు. అంతేకాకుండా నిజాం నిరంకుశ పాలనకు, దొరలు, భూస్వామల ఆగడాలకు, రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప యోధురాలు చాకలి ఐలమ్మ అని కొనియాడారు.

ప్రత్యేకంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆమె చేసిన పోరాటం, ధైర్యసాహసాలు శాశ్వత స్ఫూర్తిగా నిలిచాయన్నారు. భూస్వాముల అణచివేతకు ఎదురొడ్డి నిలబడి, పేదలకు, రైతులకు న్యాయం చేయడం కోసం కృషి చేసిన గొప్ప నాయకురాలని గుర్తుచేశారు. కాగా.. ఆమె జీవితం, పోరాటం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని, సమాన హక్కులు, సామాజిక న్యాయం కోసం పోరాడే ప్రతీ ఒక్కరికీ చాకలి ఐలమ్మ ఆదర్శంగా నిలుస్తుందని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. అందుకే.. ఆ వీరవనిత పోరాటానికి గుర్తింపునిస్తూ 'తెలంగాణ ప్రభుత్వం కోఠి మహిళా యూనివర్సిటీ'కి చాకలి ఐలమ్మ పేరు పెట్టి సముచిత గౌరవం కల్పించిందన్నారు.

అంతేకాకుండా రజక సామాజికవర్గానికి అండగా ఉంటానని, వారి పిల్లల చదువులు, ఉద్యోగాల విషయంలో తోడ్పాటు అందిస్తానని హామీనిచ్చారు ఎమ్మెల్యే. త్వరలో బిచ్కుంద మండల కేంద్రం మున్సిపాలిటీ అవుతుందని, అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దర్పల్ గంగాధర్, మల్లికార్జున్, విట్టల్ రెడ్డి, అశోక్ సెట్ గుప్తా, గోపాల్ రెడ్డి, సోపన్, బోగుడమీద సాయిలు, అశోక్, సురేష్ గొండ, బొడ్డొల్ల బసేట్టి, విట్టల్, రజక సంఘం సభ్యులు, స్థానిక మండల నాయకులు,ప్రజలు పాల్గొన్నారు.


Similar News