'ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే గ్రూప్-1 పరీక్ష రద్దు'.. కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం..

Update: 2023-09-25 10:34 GMT

దిశ, ఆర్మూర్: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే గ్రూప్ 1 పరీక్ష రద్దు చేయడం జరిగిందని పీడీఎస్‌యూ నాయకులు అన్నారు. గ్రూప్ 1 పరీక్షల రద్దును నిరసిస్తూ ఆదివారం పీడీఎస్‌యూ నాయకులు ఆర్మూర్ నియోజకవర్గంలోని అర్మూర్ పట్టణ కేంద్రంలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు ధర్నా నిర్వహించి, సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి దుర్గా ప్రసాద్, ఆర్మూర్ ఏరియా ప్రధాన కార్యదర్శి నిఖిల్ లు మాట్లాడుతూ.. బీఅర్ఎస్ ప్రభుత్వం మొదటి నుంచి ఉద్యోగాల భర్తీ విషయంలో మోసపూరితమైన వైఖరి, నిరుద్యోగుల పట్ల కపటప్రేమ తేటతెల్లం అయ్యిందన్నారు. గతంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తే రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించలేదు అన్నారు.


తెలంగాణా ప్రభుత్వం ఒక పక్క అడ్డదిడ్డంగా, ఇష్టానుసారంగా నోటిఫికేషన్లు ఇవ్వడం, మరో పక్క ఎవరో ఒకరు కోర్టుకెళ్లడం నోటిఫికేషన్‌పై కోర్టులు స్టే ఇవ్వడం వలన నిరుద్యోగులు అన్యాయం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీ పై కనీస బాధ్యత లేకుండా, రివ్యూ కూడా చేయడం చేతకాని దుస్థితి నెలకొంది అన్నారు. కేసీఆర్ పాలనలో నిరుద్యోగులు అడుగడుగునా దగా, మోసం, నిర్లక్ష్యానికి గురవుతున్నారని అన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి అని డిమాండ్ చేశారు. తక్షణమే చైర్మన్ జనార్ధన్ రెడ్డి ని తొలగించి బోర్డును ప్రక్షాళన చేయాలన్నారు. నిరుద్యోగుల గోడు వినిపించేలా పెద్ద ఎత్తున విద్యార్థులు, నిరుద్యోగులు వచ్చే ఎన్నికల్లో ఈ కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ్, అనిల్, నితిన్, రణవీర్, అభిలాష్, తదితరులు పాల్గొన్నారు.


Similar News