కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కడుతున్న బీఆర్ఎస్ నాయకులు

కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కలవరం మొదలైందా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.

Update: 2024-02-25 13:43 GMT

దిశ, తాడ్వాయి : కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కలవరం మొదలైందా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి తాడ్వాయి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గత కొన్నేళ్లుగా పార్టీని నమ్ముకుని ఉండగా వారికి ప్రాధాన్యత దక్కదేమో అనే అనుమానం వ్యక్తమవుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఓటమితో ఆ పార్టీ నాయకులు కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండటంతో కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న నాయకుల మదిలో గుబులు మొదలైంది.

కాంగ్రెస్ నాయకులకు ప్రాధాన్యం దక్కెనా

బీఆర్ఎస్ పార్టీ కి చెందిన మండల అధ్యక్షుడు మద్ది మహేందర్ రెడ్డి ఆయన అనుచరులతో పాటు రాజంపేట్ మండలానికి చెందిన ఎంపీటీసీ హాజీ నాయక్ ను ఎమ్మెల్యే మదన్మోహన్ ఆదివారం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి చేర్చుకున్నారు. అంతే కాకుండా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, ఎంపీపీ, సీడీసీ చైర్మన్ తో సహా మరి కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని ప్రచారం జోరందుకుంది. బీఆర్ఎస్ నాయకులు ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయగా వారిని కాంగ్రెస్ పార్టీలోకి ఎలా చేర్చుకుంటారంటూ చర్చ మొదలైంది.

    దీంతో కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న నేతలకు ప్రాధాన్యత దక్కెనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా పార్టీని నమ్ముకున్న నాయకులు తమ పార్టీ అధికారంలోకి రావడంతో వివిధ పదవులు అనుభవించవచ్చు అనుకునే తరుణంలో బీఆర్​ఎస్​ నేతలే మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని తెలవడంతో తమ అవకాశాలు ఎక్కడ దెబ్బతింటాయోనని ఆందోళన చెందుతున్నారు. పార్టీని నమ్ముకున్న వారికి అవకాశాలు ఇస్తారో... బీఆర్ఎస్ పార్టీ వీడి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తారో చూడాలి మరి. 


Similar News