అభివృద్ధి కావాలా.. అరాచకం కావాలా ?
అభివృద్ధి కావాలా ? అరాచకం కావాలా ? ప్రజలు ఆలోచించాలని ఆర్మూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఆ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు.
దిశ, ఆర్మూర్ : అభివృద్ధి కావాలా ? అరాచకం కావాలా ? ప్రజలు ఆలోచించాలని ఆర్మూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఆ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మండలంలోని పత్తేపూర్, కోమన్ పల్లి గ్రామాల్లో సోమవారం జీవన్ రెడ్డి పెద్దఎత్తున 'ప్రజా ఆశీర్వాద యాత్ర' నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి మళ్లీ బీఆర్ఎస్ కే పట్టం కట్టాలని, తనను దీవించాలని జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. గ్రామాల్లో ప్రజలు నీరాజనాలు పట్టారు. డప్పు, వాయిద్యాలు, మేళ తాళ్లాలతో ప్రజలు మంగళ హారతులు పట్టారు. మహిళలు బోనాలతో, యువకులు బైక్ ర్యాలీలతో కేరింతలు కొడుతూ తమ అభిమాన నేతను ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభల్లో జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. తనకు అభివృద్ధి, ప్రజాసంక్షేమం తప్ప మరో పనిలేదన్నారు.
ఆర్మూర్ గడ్డపై రౌడీయిజం సాగదు. కాంగ్రెస్ ఒక చీడ..బీజేపీ ఒక పీడ. ఈ రెండు అవినీతికర, అవకాశవాద పార్టీల దరిద్రం మనకు అవసరమా?. "కారు"జోరులో కాంగ్రెస్, బీజేపీ పరారు కావడం ఖాయమని, అభివృద్ధి, సంక్షేమం బీఆర్ఎస్ కవచ కుండలాలు అన్నారు. ఆర్మూర్ అభివృద్ధి ముందుకు సాగాలంటే మళ్లీ నన్ను దీవించండి" అని జీవన్ రెడ్డి ప్రజలను అర్ధించారు.
బీఆర్ఎస్ ఎన్నికల మెనిఫెస్టో పేద ప్రజలకు వరం. మన మేనిఫెస్టోను ప్రతి గడపగడపకు తీసుకెళ్లాలన్నారు. గత పదేళ్ల కాలంలో ఫతేపూర్ గ్రామంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పనులను ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వివరించి, భవిష్యత్తులో చేపట్టబోయే పనులను వివరించారు. ఇంత అభివృద్ధి గతంలో ఎప్పుడైనా చూసారా ?. ఈ అభివృద్ధి ఇంకా ముందుకు సాగాలంటే బీఆర్ఎస్ ను గెలిపించి మళ్ళీ నాకు ఓట్లు వేసి మీ బిడ్డను ఆదరించండి అని జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లు కొత్తపల్లి లక్ష్మీ లింబాద్రి, నీరడి రాజేశ్వర్, ఎంపీటీసీ కొక్కుల హనుమండ్లు, సొసైటీ చైర్మన్ గడ్డం శ్రావణ్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సహోదరు రెడ్డి, నాయకులు గయల్ గంగారెడ్డి, లక్ష్మీనారాయణ గౌడ్, రమణ, శ్రీధర్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.