ఓట్ల కోసమే నిజాం షుగర్ ఫ్యాక్టరీ పేరిట బాండ్ డ్రామా

కేవలం ఎన్నికల కోసమే ఎంపీ అరవింద్ మరోసారి బాండ్ పేరిట డ్రామాకు తెరతీశారని, నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని బాండు రాసి రైతులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపణలు చేశారు.

Update: 2024-03-22 09:33 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కేవలం ఎన్నికల కోసమే ఎంపీ అరవింద్ మరోసారి బాండ్ పేరిట డ్రామాకు తెరతీశారని, నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని బాండు రాసి రైతులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపణలు చేశారు. శుక్రవారం నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బాజిరెడ్డి గోవర్ధన్ ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. నిజామాబాద్ పార్లమెంట్‌లో ప్రశ్నించే గొంతుక అవసరం అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే ప్రధాన పోటీ అని తెలిపారు. గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో ఐదు రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని , పసుపు బోర్డు పేరుతో ఎంపీ అరవింద్ రైతులను మోసం చేశారు అన్నారు. ప్రధాని మోడీ చేత ప్రకటన చేయించిన ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు ఎక్కడ పెట్టారో చూపెట్టి ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు.

ఓట్ల కోసమే నిజాం షుగర్ ఫ్యాక్టరీ బాండ్ పేపర్ డ్రామా ఆడుతున్నారన్నారు. ఎంపీగా గెలవకముందు షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని పాదయాత్ర చేశారని, గెలిచిన తర్వాత ఫ్యాక్టరీని ప్రైవేట్ భాగస్వామ్యంలో తెరిపిస్తానని ఆనాడే హామీ ఇచ్చి చెరుకు రైతులను మోసం చేసిన చరిత్ర ధర్మపురి అరవింద్ ది అని అన్నారు. ఎంపీ అరవింద్ కాలం చెల్లింది, ఆయన ఓటమి ఖాయం అయ్యిందన్నారు. హామీలు ఇచ్చి మోసం చేయడంలో సీఎం రేవంత్ ఎంపీ అరవింద్ ఒక్కటే అని గుర్తు చేశారు. మోదీ గెలవాలి అరవింద్, బండి సంజయ్ లాంటి వాళ్ళు ఓడిపోవాలని ప్రజలు భావిస్తున్నారు అన్నారు. మార్కెట్లో పసుపు రేటు పెరుగుదలలో బీజేపీ ప్రమేయం ఏమీ లేదన్నారు. అరవింద్ ఎంపీ కాక ముందే పసుపు రైతు 17 వేలు ధర లభించిందని గుర్తు చేశారు. తాను నిజామాబాద్ జిల్లాలో సుపరిచితుడు నేనని తనకు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో సత్సంబంధాలు ఉన్నాయని, జగిత్యాల జిల్లాలో కోరుట్లకు తనకు అవినావ భావ సంబంధం ఉందన్నారు. ప్రజలు, కార్యకర్తల మద్దతుతో ఎంపీగా గెలుస్తానని బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.


Similar News