BJP MLA : రైతు వ్యతిరేక ప్రభుత్వానికి బీజేపీ ఎమ్మెల్యేల నిరసన..

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న నిరుద్యోగ, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా బీజేపీ ఎమ్మెల్యేలు హైదరాబాదులో మంగళవారం నిరసన చేపట్టారు.

Update: 2024-07-23 09:45 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న నిరుద్యోగ, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా బీజేపీ ఎమ్మెల్యేలు హైదరాబాదులో మంగళవారం నిరసన చేపట్టారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డిలు రాష్ట్రంలోని ఇతర జిల్లాల బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాల సమర్పించారు. అనంతరం అక్కడి నుంచి గన్ పార్క్ వరకు ప్లకార్డులు చేత పట్టుకుని పాదయాత్రగా వెళ్లారు. అక్కడి అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి అసెంబ్లీని చేరుకున్నారు.

ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, ఐదు డిక్లరేషన్లు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే హామీల సంగతి మర్చిపోయిందని ధన్పాల్ విమర్శించారు. సోనియమ్మ జన్మదినం సందర్భంగా డిసెంబర్ 9న రైతన్నలకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడనేక ఆంక్షలు పెట్టి కొంత మందికే రూ. లక్ష రుణమాఫీ చేయడాన్ని బీజేపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. అర్హులైన ప్రతి రైతుకు ఏక కాలంలోనే రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరంగల్ రైతు డిక్లరేషన్ హామీలను కూడా అమలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు.

తెలంగాణ నిరుద్యోగ యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వారి కళ్ళలో కారం కొట్టే ప్రయత్నం చేస్తుందని బీజేపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. మెగా డీఎస్సీ అని చెప్పి పూర్తిస్థాయిలో నోటిఫికేషన్ వేయకుండా, జాబ్ క్యాలండర్ విడుదల చేయకుండానే ఏడాదిలోపు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని రేవంత్ సర్కార్ నిరుద్యోగులను మోసం చేసిందని మండిపడ్డారు. భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా ఇచ్చిన యువ డిక్లరేషన్ అమలు చేయాలని, జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీలో సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యేలం అందరం ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ గ్యారంటీలు, హామీల పై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.

Tags:    

Similar News