స్పెషల్ డ్రైవ్ లో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం

శానిటైజేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులతో పాటు మహిళలు, యువత, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులను భాగస్వాములను చేసి పల్లెలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.

Update: 2024-02-07 14:27 GMT

దిశ, భిక్కనూరు : శానిటైజేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులతో పాటు మహిళలు, యువత, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులను భాగస్వాములను చేసి పల్లెలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం ఆయన ఈనెల 14 వరకు జరగనున్న స్పెషల్ శానిటైజేషన్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా దోమకొండ లో జరిగిన పారిశుద్ధ్య పనులలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేతిలో పార పట్టుకొని మురికి కాలువల పక్కన ఉన్న పచ్చి గడ్డిని చెక్కి, పిచ్చి మొక్కలను తొలగించారు. పారిశుద్ధ్య సిబ్బందితో కాలువలలో పేరుకుపోయిన మురికిని దగ్గరుండి తీయించారు. మన గ్రామం అన్న భావనతో మెదిలి ఎక్కడపడితే అక్కడ చెత్తా చెదారం వేయకుండా ప్రజలు శుభ్రంగా ఉంచుకోవాలని, రోడ్లకు ఇరువైపులా పచ్చని చెట్లు, అందమైన పూల మొక్కలు పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

    ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే విధంగా చూడాలని, వాటి ద్వారా కలిగే అనర్థాలను ప్రజలకు వివరిస్తూ అవగాహన కల్పించాలన్నారు. మనలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసే విధంగా ప్లాస్టిక్ బాటిళ్లను వృధాగా పడేయకుండా ఆకర్షణీయమైన అలంకరణ వస్తువులను తయారు చేసేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలకు వెళ్లి విద్యార్థినులతో మాట్లాడారు. బాలికల టాయిలెట్స్ బయటకు కనిపించకుండా ప్రహరీ గోడ నిర్మించాలని ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు కోరగా, వెంటనే గ్రీన్ షెడ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించడంతో సంతోషం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి పెట్టి మురికి కాలువలను శుభ్రం చేయించాలని, తడి పొడి చెత్త వేరువేరుగా సేకరించి రీసైక్లింగ్ చేయించాలని, తాగునీటి అవసరాలకు

     ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పైప్ లీకేజీ పనులను వెంటనే చేయించాలని, క్రమం తప్పకుండా తాగునీటిని అందించాలని, నెలలో మూడుసార్లు ట్యాంకుల్లో క్లోరినేషన్ చేయించాలన్నారు. నీళ్ల కోసం మోటార్లు పెట్టకుండా చర్యలు తీసుకొని అక్రమ నీటి వినియోగాన్ని అరికట్టాలన్నారు. పల్లె ప్రగతి లో భాగంగా ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, కంపోస్టు షెడ్ల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, డీఎల్పీ ఓ సాయిబాబా, ఎంపీపీ అధ్యక్షురాలు కానుగంటి శారద, జెడ్పీటీసీ సభ్యుడు తీగల తిర్మల్ గౌడ్,ఎంపీడీఓ చిన్నారెడ్డి, తహసీల్దార్ సంజయ్ రావు, తాజా మాజీ సర్పంచ్ అంజలి తదితరులు పాల్గొన్నారు. 


Similar News