మంత్రులపై పీసీసీ అసంతృప్తి.. స్వీట్ వార్నింగ్

Update: 2024-10-07 03:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పార్టీ చేపట్టే యాక్టివిటీస్‌ను లైట్ తీసుకోవడం సరికాదని మంత్రులపై పీసీసీ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. కొత్త పీసీసీ చీఫ్ ​మహేశ్​ గౌడ్ రూపొందించిన మంత్రుల ముఖాముఖికి సకాలంలో షెడ్యూల్ ఇవ్వకపోవడంపై పీసీసీ సీరియస్‌గా ఉన్నది. వారంలో 3 గంటలు పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీభవన్‌కు కేటాయించడంలో అభ్యంతరమేమిటి? అంటూ పీసీసీ ప్రశ్నిస్తున్నది. ఇప్పటికే రెండు, మూడు సార్లు షెడ్యూల్ ఇవ్వాలాని కోరినా, కొందరు మంత్రులు స్పందించకపోవడాన్ని పీసీసీ తప్పుపట్టింది. ప్రభుత్వంతో పాటు పార్టీ కూడా అవసరమేనంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారం గాంధీభవన్ ముఖాముఖికి రావాల్సిందేనంటూ పీసీసీ చీఫ్ ​మహేశ్​ గౌడ్ నొక్కి చెప్తున్నారు. స్టేట్ ప్రోగ్రాం సక్సెస్ అయితే జిల్లాల్లో మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నామని, ఈ క్రమంలో గాంధీభవన్ ప్రోగ్రాంకే సమయం కేటాయించకపోతే సరికాదంటూ పీసీసీ చీఫ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రతి మంత్రి గాంధీభవన్ కోసం వన్ మంత్ షెడ్యూల్‌ను ఇవ్వాలని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ కోరారు.

గత నెల 25న షురూ.. ఆ తర్వాత గ్యాప్‌లు

నూతన టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఆదేశాల ప్రకారం గత నెల 25న గాంధీభవన్‌కు మంత్రుల సందర్శన కార్యక్రమం ప్రారంభమైంది. ప్రతి బుధ, శుక్రవారాల్లో మంత్రుల విజిట్‌లు ఉంటాయని నిర్ణయించారు. అయితే, ఆ తర్వాత ప్రభుత్వ కార్యాక్రమాల్లో మంత్రులు బిజీగా ఉండటం వల్ల సరైన సమయానికి ఈ ప్రోగ్రాంను నిర్వహించలేకపోయారు. మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి రెండో రోజు కార్యక్రమానికి హాజరైన తర్వాత కూడా రెండు సార్లు మంత్రుల విజిట్ ప్రోగ్రాం వాయిదా పడింది. ఇలా ప్రోగ్రాంలు మిస్సవుతుండటంతో పార్టీ సీరియస్‌గా తీసుకున్నది. ప్రభుత్వంలోకి తీసుకొచ్చిన పార్టీని కూడా గౌరవించాల్సిన బాధ్యత ఉన్నదంటూ పీసీసీ చీఫ్​ నేరుగానే చెప్తున్నారు. సెక్రెటేరియట్ ఎంత ముఖ్యమో? గాంధీభవన్ కూడా అంతే ఇంపార్టెంట్ అంటూ కొత్త పీసీసీ‌గా బాధ్యతలు తీసుకునే రోజు స్వయంగా సీఎం, కేబినెట్ మంత్రుల ముందు వివరించారు.

స్పీచ్‌లలోనూ మార్పు రావాల్సిందే..

మంత్రి కొండా సురేఖ ఘటన తర్వాత, మినిస్టర్ల లాంగ్వేజ్‌పై పీసీసీ చీఫ్​ సీరియస్‌గా మానిటరింగ్ చేస్తున్నారు. పవర్‌లో ఉన్న టైంలో మంత్రులు ఆచితూచి మాట్లాడాల్సింది ఉంటుందని, ప్రతిపక్షాలు టెంప్ట్ చేసినా, నోరు జారవద్దని సున్నితంగానే సూచించారు. మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలంటూ రిక్వెస్ట్ చేశారు. గత పరిస్థితులను పక్కనపెట్టి, కొత్త సంప్రదాయాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని, ప్రజలు కాంగ్రెస్ నుంచి అదే కోరుకుంటున్నారని కొత్త పీసీసీ చీఫ్, ఇటీవల మంత్రులందరినీ కోరినట్టు తెలిసింది. కార్యకర్తలను కాపాడుకునేందుకు ప్రతి మంత్రి సహకరించాలని, పదేండ్ల పవర్‌కు వాళ్లే అండగా నిలుస్తారని పీసీసీ చీఫ్ ​స్పష్టం చేశారు.


Similar News