కొత్త ఆర్వోఆర్ చట్టం డ్రాఫ్ట్ రెడీ: ధరణి కమిటీ సభ్యుడు ఎం.కోదండరెడ్డి

పాత ఆర్వోఆర్ చట్టం ద్వారా లక్షలాది మంది రైతులు రోడ్డున పడ్డారని, అందుకే కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నామని ధరణి కమిటీ సభ్యుడు ఎం.కోదండరెడ్డి స్పష్టం చేశారు.

Update: 2024-07-09 00:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పాత ఆర్వోఆర్ చట్టం ద్వారా లక్షలాది మంది రైతులు రోడ్డున పడ్డారని, అందుకే కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నామని ధరణి కమిటీ సభ్యుడు ఎం.కోదండరెడ్డి స్పష్టం చేశారు. కొత్త ఆర్వోఆర్ చట్టం డ్రాఫ్ట్‌ను ప్రభుత్వానికి సమర్పించామన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మంథని గౌరెల్లిలో లీఫ్స్ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త చట్టం ప్రవేశపెట్టి ఆమోదించనున్నట్టు తెలిపారు. ధరణి పోర్టల్‌ను అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత భూమి హక్కులు హరించుకుపోయాయన్నారు.

ఐదేండ్ల నుంచి లక్షలాది మందికి వారి సొంత భూములు అమ్ముకోవడానికి కూడా వీల్లేకుండా మాజీ సీఎం కేసీఆర్ చేశారన్నారు. తప్పుడు విధానాల ద్వారా తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. అందుకే కేసీఆర్‌పై కేసు పెట్టే యోచనలో ఉన్నామన్నారు. న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్టు చెప్పారు. ఈ భూ సమస్యలన్నింటికీ కేసీఆరే కారణమని ఆరోపించారు. టెర్రాసిస్ అనే దివాలా తీసిన విదేశీ కంపెనీకి అత్యంత విలువైన భూ రికార్డులను, డేటాను అప్పగించారన్నారు.

ఆర్వోఆర్ 2020లో మార్గదర్శకాలు కూడా జారీ చేయలేదన్నారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఈ విషయాన్ని లేవనెత్తామన్నారు. ధరణిలోని లోపాలను సరిదిద్ది కొత్త వ్యవస్థను రూపొందిస్తామని రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హామీ ఇచ్చినట్టు గుర్తుచేశారు. తప్పులు రిపీట్ కాకుండా మెరుగైన వ్యవస్థను అమలు చేసేందుకే కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నట్టు చెప్పారు.

ఖమ్మం జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య అంశాన్ని తీసుకొని ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వాస్తవాలను తెలుసుకొని మాట్లాడాలని బీఆర్ఎస్ నాయకులకు హితవు పలికారు. భూ సమస్యల పరిష్కారానికి భూమి సునీల్ ఆధ్వర్యంలో లీఫ్స్ సంస్థ యాచారం మండలంలోని 10 గ్రామాల్లో చేపట్టిన పైలెట్ ప్రాజెక్టు విజయవంతమైందని కొనియాడారు. ఈ రిపోర్ట్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సమర్పించి సమస్యలు పరిష్కారమయ్యేటట్టు చూస్తామన్నారు.


Similar News