రేవంత్.. ఇదేనా నీ భాష, సంస్కారం : ఎంపీ ఈటల రాజేందర్ మండిపాటు

రేవంత్ కు ప్రజాక్షేత్రంలోకి వెళ్లి తిరిగి చూసే టైం లేదని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2024-10-06 16:41 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రేవంత్ కు ప్రజాక్షేత్రంలోకి వెళ్లి తిరిగి చూసే టైం లేదని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము నిత్యం ప్రజల మధ్య ఉన్నామని, ప్రజల ఆక్రందనలపై మాట్లాడితే తమను సీఎం రేవంత్ కాలకేయులుగా పోలుస్తున్నారని, ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఈ భాష ప్రయోగించవచ్చా? ఇదేనా ఆయన సంస్కారమంటూ ఘాటు విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆదివారం ఆయన బహిరంగ లేఖ రాశారు. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ మూసీ ప్రక్షాళన చేస్తానని చేయలేదని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మూసీ ప్రక్షాళన చేస్తానంటే తాము అడ్డుకోబోమని ఆయన పేర్కొన్నారు. కానీ పట్టా భూములను కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఉంటున్న వారిని బఫర్ జోన్ పేరుతో అక్రమంగా కట్టుకుని ఉంటున్నారని చిత్రీకరించడం దుర్మార్గమైన చర్యగా ఆయన పేర్కొన్నారు. పిడికెడు అక్రమ ఇండ్లను బూచిగా చూపి కోట్ల విలువ చేసే ఇండ్లను కూలగొడుతున్నారన్నారు. మూసీని కొబ్బరినీళ్లలా చేసేందుకు, ఎకలాజికల్ బ్యాలెన్స్ కాపాడటానికి, విదేశీ పక్షులు రావడానికి, చేపలు పెంచడానికి, పిల్లలు ఈతకొట్టేలా చెరువులు తయారు చేయడానికి తాను వ్యతిరేకం కాదని, కానీ హైదరాబాద్ లో ఉన్న ఏ చెరువు కూడా పక్షులు, చేపలకు నిలయంలా లేదనే విషయాన్ని రేవంత్ గుర్తుంచుకోవాలన్నారు. ముందు ఈ చెరువుల్లో ఉన్న దుర్గంధాన్ని తొలగించాలని, అది చేయకుండా 40 ఏండ్ల క్రితం ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూముల్లో, ప్రభుత్వం అనుమతించిన లే అవుట్లలో ఇల్లు కట్టుకున్న పేద ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ అడ్డగోలుగా కూల్చివేయడాన్ని వ్యతిరేకించారు. తమ ఇండ్లను కూల్చొద్దని కాళ్లపై పడినా వదిలిపెట్టలేదని మండిపడ్డారు. దొంగల్లా దాడి చేసి ఇండ్లు కూల్చడం ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోందన్నారు. చట్టప్రకారం, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని, ప్రభుత్వానికి అపరిమిత అధికారాలు లేవనే విషయాన్ని గుర్తంచుకోవాలని సూచించారు.

మూసీ ప్రక్షాళనపై రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ ఏంటో చెప్పాలని ఈటల రాజేందర్ సీఎంను ప్రశ్నించారు. బ్యూటిఫికేషన్ పేరిట మాల్స్ కట్టి పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారా? అని అనుమానం వ్యక్తంచేశారు. అసలు దీనికి డీపీఆర్ ఉందా? అని, ఇండ్లు కోల్పోతున్న వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏంటనే అంశాలపై సమాధానం చెప్పాలన్నారు. కోట్లు విలువ చేసే ఇండ్లు తీసుకొని డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తామనడం సరికాదన్నారు. సబర్మతి నది ప్రక్షాళనకి రూ.2 వేల కోట్లు, నమోగంగ ప్రాజెక్టుకి 12 ఏళ్లలో రూ.22 వేల కోట్లు ఖర్చయితే మూసీ ప్రక్షాళనకు రూ.లక్షన్నర కోట్లు ఎందుకు ఖర్చవుతాయని ఈటల ప్రశ్నించారు. ఈ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారో సమాధానం చెప్పాలన్నారు. స్టేజీలపై ప్రకటనలు చేయడం కాకుండా.. అఖిలపక్ష సమావేశం పెడితే తాము ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నామని ఈటల స్పష్టంచేశారు. మూసీ ప్రక్షాళన కోసం రూ.లక్షన్నర కోట్లు పెట్టే ఖర్చు పేదల కోసమేనా? అనే అంశంపై కూడా క్లారిటీ ఇవ్వాలన్నారు. ఈ విషయాలపై స్పష్టత వచ్చే వరకు తాను ప్రతిఘటిస్తానని సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు.


Similar News