సికింద్రాబాద్‌ టు గోవా.. బై వీక్లీ ట్రైన్ ప్రారంభం

రాష్ట్రంలో పదేళ్లలో రైల్వేల పురోగతి గణనీయంగా పెరిగిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు...

Update: 2024-10-06 16:44 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పదేళ్లలో రైల్వేల పురోగతి గణనీయంగా పెరిగిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కొత్త రైల్వే లైన్లు, విద్యుదీకరణ, డబ్లింగ్, ట్రిప్లింగ్ పనులు చాలా వరకు పూర్తయ్యాయని, మిగిలిన చోట్ల పనులు చాలా వేగంగా సాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మిగిలిన చోట్ల పనులు చాలా వేగంగా సాగుతున్నాయని గుర్తుచేశారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆదివారం సికింద్రాబాద్-గోవా మధ్య బై వీక్లీ ట్రైన్‌ను కిషన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సికింద్రాబాద్ నుంచి గోవా వెళ్లేందుకు డైరెక్ట్ ట్రెయిన్ ఉండేది కాదని, వారానికి ఒక రైలు 10 కోచ్‌లతో సికింద్రాబాద్ నుంచి బయలుదేరి గుంతకల్‌కు చేరుకొని ఆపై తిరుపతి నుంచి గోవాకు వెళ్లే మరో 10 కోచ్‌లతో గోవాకు వెళ్లే పరిస్థితి ఉండేదన్నారు. దీంతోపాటుగా కాచిగూడ-యలహంక మధ్య వారానికి 4 రోజులు ప్రయాణం సాగించే రైలుకు గోవాకు వెళ్లే 4 కోచ్‌లను కలిపేవారన్నారు. ఈ 4 కోచ్‌లను తిరిగి గుంతకల్ వద్ద షాలిమార్-గోవా మధ్యన తిరిగే రైలుకు కలిపి ప్రయాణం సాగించేవారని ఆయన పేర్కొన్నారు. దీంతో సికింద్రాబాద్-గోవా మధ్య రైళ్లన్నీ 100 ఆక్యుపెన్సీతో వెళ్లడం, చాలా మంది సీట్లు దొరక్క ఇబ్బందులు పడుతున్న విషయం తన దృష్టికొచ్చిందని, ఈ పరిస్థితిని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌కు వివరించగా బై వీక్లీ రైలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ బైవీక్లీ రైలు బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుందని, వాస్కోడగామా నుంచి గురువారం, శనివారం తిరుగు ప్రయాణమవుతుందని పేర్కొన్నారు.

ఇది సికింద్రాబాద్, కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బెళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్‌డెమ్, మడగావ్ జంక్షన్లలో ఆగుతూ వాస్కోడగామా చేరుకుంటుందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఢిల్లీ తర్వాత అత్యధికంగా 5 వందేభారత్ రైళ్లు సికింద్రాబాద్ నుంచి వెళ్తున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో కొత్త టర్మినళ్ల ఏర్పాటు ప్రక్రియ కూడావేగవంతంగా జరుగుతోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. పదేళ్లలో కేంద్రం తెలంగాణలో రైల్వేల విస్తరణకు కేంద్రం కృషిచేసిందని, మూడోసారి అధికారంలోకి వచ్చాక మరిన్ని రైల్వే అభివృద్ధి పనులకు నిధులు కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా రైలు ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంసృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ జానపద నృత్యాలు నిలిచాయి. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్కూల్ విద్యార్థులు భారతీయ నృత్యం(సెమీ క్లాసికల్)తో అలరించారు.


Similar News