తెలంగాణ ప్రజలకు దసరా కానుక.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణ ప్రజలకు దసరా కానుకపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక ప్రకటన చేశారు...
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర విద్యార్థులకు మెరుగైన విద్య అందజేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్ఫష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న దసరా కానుక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో చదువుతున్న ఆరు లక్షల మంది పిల్లల భవిష్యత్తు కోసం ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం తీసుకున్న నిర్ణయమిదని వివరించారు. ఆదివారం సచివాలయంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పై నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడారు. గత పది నెలలుగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశామని, కానీ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం ఎంతో గొప్ప కార్యక్రమన్నారు. రాష్ట్రంలో విద్యార్ధులు సౌకర్యాలలేమితో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. 600 మంది విద్యార్ధులు 20 రూముల్లో ఉంటున్నారన్నారు. 20 మందికి ఒక టాయిలెట్ కూడా లేని పరిస్థితులున్నాయన్నారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయంబర్స్ మెంట్ తీసుకువచ్చి నిరుపేద విద్యార్ధుల చదువులకు అండగా నిలబడ్డామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మించి రాష్ట్రంలో విద్యా విప్లవం సృష్టించబోతున్నామన్నారు. ప్రతిపక్షాలు ప్రతి కార్యక్రమాన్ని రాజకీయాల కోసం విమర్శలు చేస్తున్నాయని, కనీసం ఈ పాఠశాల ఏర్పాటునైనా అభినందించాలని కోరుతున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం తీసుకువచ్చిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతిపాదనలను ప్రజలకు చేర్చాల్సిన బాధ్యత మీడియాపై ఉందన్నారు. ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో అన్ని వర్గాల పిల్లలు చక్కగా చదువుకునేలా మౌళిక వసతుల కల్పిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.