కేబినెట్ భేటీ తర్వాతే కొత్త రేషన్ కార్డులు!

రాష్ట్రంలో ఎంతోమంది ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Update: 2024-07-08 02:17 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎంతోమంది ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఏ పథకం అమలు కావాలన్నా దానికి ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డును తీసుకుంటున్నారు. అయితే, చాలా మందికి రేషన్ కార్డులు లేవు. దీంతో కొన్ని పథకాలకు వారు దూరం అవుతున్నారు. డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6 వరకు నిర్వహించిన ప్రజా పాలనలో ఆరు గ్యారంటీలకు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఇందులో రేషన్ కార్డుల కోసం కూడా చాలా మంది అప్లై చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కారు కొత్త రేషన్ కార్డుల జారీపై కసరత్తు చేస్తోంది. తాజాగా ముఖ్యమంత్రి త్వరలోనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించారు. కొత్తగా పోర్టల్ ప్రారంభించి కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం కొత్త కార్డులు త్వరలో ఇస్తామని అనౌన్స్ చేశారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలో రేషన్ కార్డుల జారీకి సంబంధించి విధివిధానాలు ఖరారు చేయనున్నారు.

10 లక్షల ఫ్యామిలీస్ అప్లై చేస్తాయని అంచనా

రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 90 లక్షల రేషన్‌ కార్డులున్నాయి. వీటిలో 55 లక్షలు కేంద్ర ప్రభుత్వం జారీచేసినవి. రాష్ట్ర ప్రభుత్వ కార్డులు 35 లక్షలు. కొత్త కార్డుల కోసం పోర్టల్‌ ఓపెన్‌ చేస్తే..మరో 10 లక్షల కుటుంబాల నుంచి దరఖాస్తులు వస్తాయని పౌరసరఫరాల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో బీపీఎల్ కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయని, ఇప్పుడు రాష్ట్ర సర్కారు కోటాలో ఉన్న రేషన్ కార్డులు..సెంట్రల్ కోటాలోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది. కానీ కేంద్రం నుంచి ఇంత వరకు ఎలాంటి స్పందన రాలేదు. దీనిపై ఏం చేయాలన్న దానిపైన ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆహార భద్రత కార్డుల స్థానంలో కొత్త కార్డులను జారీ చేయాలని ప్రభుత్వం డెసిషన్ తీసుకుంది. ఈ ప్రక్రియ కోసం అధికారికంగా ఉత్తర్వులు జారీ కానున్నాయి. కాగా, కొత్త కార్డుల మంజూరు పై కేబినెట్ భేటీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వారం రోజుల్లో దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి లింక్ కూడా ‘మీసేవ’లో యాక్టివేట్ అవుతుందని సమాచారం.

ప్రభుత్వ పథకాల అమలుకు రేషన్ కార్డు తప్పనిసరి!

‘మీ-సేవ’లో మెంబర్‌ అడిషన్‌ పోర్టల్‌ ద్వారా ఇప్పటివరకు 11 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిపై కూడా రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కొత్త కార్డులు ఇచ్చే సమయంలోనే మెంబర్‌ అడిషన్‌పై కూడా డెసిషన్ తీసుకుంటారని సమాచారం. ఈ రెండు ప్రక్రియలూ పూర్తిచేస్తే రేషన్‌ కార్డుల సమస్య దాదాపుగా కొలిక్కివచ్చే అవకాశాలున్నాయి. ప్రభుత్వ పథకాల అమలుకు రేషన్ కార్డు తప్పనిసరి చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. దీంతో, రేషన్ కార్డు పొందేందుకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్న వేళ..విధి విధానాల ఖరారు పైన ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు.


Similar News