డిగ్రీలో అందుబాటులోకి కొత్త కోర్సులు!

డిగ్రీలో కొత్త కోర్సును ప్రవేశ పెట్టాలని ఉన్నత విద్యా మండలి అధికారులు భావిస్తున్నారు. బీఏ డిఫెన్స్ సైన్స్ సెక్యూరిటీ కోర్సును తీసుకురావాలని చూస్తున్నారు.

Update: 2025-01-07 03:15 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: డిగ్రీలో కొత్త కోర్సును ప్రవేశ పెట్టాలని ఉన్నత విద్యా మండలి అధికారులు భావిస్తున్నారు. బీఏ డిఫెన్స్ సైన్స్ సెక్యూరిటీ కోర్సును తీసుకురావాలని చూస్తున్నారు. దీనికి సంబంధించిన కసరత్తును ఉన్నత విద్యా మండలి అధికారులు చేస్తున్నట్లు తెలిసింది. తొలుత సెలెక్టెడ్ కాలేజీల్లో దీన్ని అమలు చేసి దానికి వచ్చే ఆదరణకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలని అధికారులు భావిస్తున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ కోర్సు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫీసర్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, డిగ్రీలో కామన్ సిలబస్ ను తీసుకొచ్చే ప్లాన్ లో కూడా ఉన్నట్లు తెలిసింది. అలాగే సబ్జెక్టుల వారీగా 30 నుంచి 40 ప్రశ్నలతో కూడిన మెటీరియల్ ను విద్యార్థులకు అందించాలని ప్లాన్ చేస్తున్నారు. దీన్ని సైతం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం.

సిలబస్ లో మార్పులు..

జేఎన్టీయూ సిలబస్ లోనూ పలు మార్పులు చేయాలనే యోచనలో ఉన్నత విద్యామండలి ఉన్నట్లు తెలుస్తోంది. రీసెర్చ్‌ కల్చర్‌ను మరింతగా ప్రోత్సహించేలా సిలబస్ రూపకల్పన చేపట్టాలని చూస్తున్నది. రీసెర్చ్ లు ఎక్కువగా జరిగితేనే పేరు ప్రఖ్యాతలు వస్తాయని, అందుకే దీని వైపునకు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. జేఎన్టీయూలో ప్రతి మూడేండ్లకోసారి సిలబస్‌ మార్చడం ఆనవాయితీ. ఆర్‌-22 పేరుతో మూడేండ్ల క్రితం సిలబస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సిలబస్‌ గడువు ముగియనుండటంతో ఆర్‌-25 పేరుతో కొత్త సిలబస్‌ను రూపొందించనున్నారు. ఇప్పటికే కొంత మోడల్‌ సిలబస్‌ను రూపొందించినట్లు సమాచారం. ఇంటర్న్‌ షిప్‌లు, కోర్సు పూర్తికాగానే ఉద్యోగం కల్పించే అత్యుత్తమ సిలబస్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ఉన్నత విద్యామండలి అధికారులు భావిస్తున్నారు.

అయితే ఇప్పటికే టీసీఎస్ లాంటి సంస్థలు ముందుకు వచ్చినట్లు తెలిసింది. వారే ఇంటర్న్ షిప్ తో పాటు ఉద్యోగాలు కల్పించేలా ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిసింది. దీనికి ఏఐసీటీఈ, ఐఐటీ మద్రాస్ సహకారాన్ని అందించనున్నాయి. ఈమేరకు ఈనెల 7, 8 తేదీల్లో హైదరాబాద్ హెచ్ఐసీసీ నొవాటెల్ లో తెలంగాణలోని పలువురు ప్రిన్సిపాళ్లు, ప్రొఫెసర్లతో మేధోమథనం నిర్వహించనున్నారు. దాదాపు 1000 మంది వరకు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సెమినార్‌కు అటానమస్‌, అఫిలియేటెడ్‌ కాలేజీల ప్రిన్సిపాళ్లు, ప్రొఫెసర్లు హాజరవ్వనున్నారు.

విద్యార్థులకు ఉపయోగపడేలా మెటీరియల్..

రాష్ట్రంలోని డిగ్రీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్టడీ మెటీరియల్‌ను రూపొందించాలని నిర్ణయించాం. గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు ఉపయుక్తంగా ఈ స్టడీ మెటీరియల్‌ ఉంటుంది. సబ్జెక్టుకు చెందిన ముఖ్యాంశాలు గ్రహించేలా, పరీక్షలకు సన్నద్ధం చేయడానికి ఈ స్టడీ మెటీరియల్‌ తోడ్పడనుంది. లోతైన అధ్యయనం చేసేవారి కోసం రెఫరెన్స్‌ పుస్తకాల వివరాలను సైతం మెటీరియల్‌లో పొందుపరుస్తాం. పోటీ పరీక్షల అభ్యర్థులు రూపొందించుకునేలా స్టడీ మెటీరియల్‌ ను రూపొందిస్తున్నాం. డిగ్రీ కోర్సుల సిలబస్‌ను 30 శాతం చొప్పున మార్చాలని నిర్ణయించాం.:-ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్‌


Similar News