రైతుల సంక్షేమం కోసం స్పెషల్ నెట్‌వర్క్.. పార్లమెంట్‌లో రాష్ట్రపతి ముర్ము కీలక వ్యాఖ్యలు

18వ పార్లమెంట్ తొలి సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు.

Update: 2024-06-27 05:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: 18వ పార్లమెంట్ తొలి సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. నాలుగో రోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగా రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ.. కొత్తగా ఎన్నికై వచ్చిన ఎంపీలకు తొలుత శుభాకాంక్షలు తెలిపారు. మీరంతా దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తారని ఆశిస్తున్నా అన్నారు. ఈ సారి ఎన్నికలు ఎంతో ప్రత్యేకమైనవని.. ఈ ఎన్నికల గురించి ప్రపంచమంతా చర్చించుకుంటుందన్నారు. మా ప్రభుత్వం పదేళ్లుగా దేశాభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారని.. జమ్ముకశ్మీ‌లో పెద్ద సంఖ్యలో ప్రజలు ఓటేశారన్నారు. అమృత కాలం మొదట్లో 18వ లోక్ సభ కొలువుదీరిందన్నారు.

దేశ సంస్కరణలు మరింత వేగం పుంజుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రిఫార్మ్, పర్‌ఫార్మ్, ట్రాన్స్‌ఫర్మ్ నినాదంతో మా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కొత్త స్పీకర్ ప్రజాస్వామ్య పరిరక్షణ చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఐటీ నుంచి టూరిజం వరకు అన్ని రంగాల్లో భారత్ దూసుకుపోతుందన్నారు. వ్యవసాయ ఆధారిత ఉద్యోగాలు పెరుగుతున్నాయని తెలిపారు. సురక్ష, అభివృద్ధిపై ప్రజలు నమ్మకం ఉంచారని స్పష్టం చేశారు. వికసిత్ భారత్ నినాదానికి ప్రజలు మద్దతు ఇచ్చారన్నారు. పంటలకు మద్దతు ధర కల్పించే విషయంలో కట్టుబడి ఉన్నామని క్లారిటీ ఇచ్చారు. సర్వీస్ సెక్టార్లను కూడా ప్రభుత్వం బలపరుస్తోందన్నారు.

వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామని గుర్తు చేశారు. ప్రపంచ వృద్ధిలో భారత్ 15 శాతం భాగస్వామ్యమవుతోందన్నారు. కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు పంట సాయం అందిస్తున్నామని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం పెద్ద నెట్‌వర్క్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆర్గానిక్ ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోందని.. పౌర విమాన రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చామన్నారు. జమ్ముకశ్మీర్‌పై శత్రువులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో జమ్ముకశ్మీర్ విషయంలో మార్పు కనిపించిందన్నారు. అంతకు ముందు రాష్ట్రపతికి రాజ్యసభ చైర్మన్, ప్రధాని మోడీ, స్పీకర్ ఓం బిర్లా పార్లమెంట్‌లోకి స్వాగతం పలికారు.


Similar News