Minister Damodara Rajanarsimha : క్యాన్సర్ నివారణకు అవగాహన పెంచాలి : మంత్రి దామోదర రాజనర్సింహ

Awareness should be raised to prevent cancer: Minister Damodara Rajanarsimha

Update: 2024-10-26 06:22 GMT

దిశ, వెబ్ డెస్క్ : క్యాన్సర్(Cancer) నివారణకు ప్రజల్లో అవగాహన పెంపొందించాలని, ఇందుకు ప్రభుత్వంతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరు సహకరించాలని రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Minister Damodara Rajanarsimha) అన్నారు. ఎంఎన్ జే క్యాన్సర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో హైదరాబాదులోని లుంబిని పార్క్ నుంచి ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రి వరకు నిర్వహించిన బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్ నెస్ క్యాంపెయిన్ అండ్ వాక్ (Awareness walk)ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ఎదుర్కోవడానికి ఇలాంటి అవగాహన, ప్రచార కార్యక్రమాలు ఉపయోగపడుతాయన్నారు. క్రమశిక్షణ లేని జీవన విధానం సహా అనేక కారణాలు ఈ వ్యాధి ప్రబలడానికి కారణమవుతున్నాయన్నారు. క్యాన్సర్ ‌గురించి అవగాహన లేకపోవడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పించి, ప్రాణ నష్టాన్ని నివారించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇండియాలో ఏటా 14 నుంచి 15 లక్షల కేసులు నమోదవుతుంటే తెలంగాణలో 50 నుంచి 60 వేల క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. మహిళల క్యాన్సర్ వ్యాధుల్లో ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. 1.4 శాతం బ్రెస్ట్ కేన్సర్ సంబంధిత కేసులే ఉంటున్నాయని డాక్టర్లు చెబుతున్నారని చెప్పారు. దీనిపై అవగాహన కల్పించి, స్క్రీనింగ్ చేస్తే ప్రాథమిక దశలోనే రోగ నిర్ధారణ చేపి ప్రాణాలు కాపాడవచ్చన్నారు.

ప్రభుత్వం ఉచితంగా స్క్రీనింగ్, ట్రీట్మెంట్ అందిస్తోందని, ప్రతి గ్రామంలో మొబైల్ ల్యాబ్స్ ద్వారా ఉచితంగా స్క్రీనింగ్ చేయిస్తామని మంత్రి దామోదర్ పేర్కొన్నారు. అలాగే, 6 క్యాన్సర్ రీజినల్ సెంటర్స్ ఏర్పాటు చేయబోతున్నామని రాజనర్సింహ చెప్పారు. ఈ సెంటర్లలో డాక్టర్లు, పూర్తి స్థాయిలో పరికరాలు తీసుకొస్తామని, ఈ సెంటర్లన్నింటికి ఎంఎన్ జే హాస్పిటల్ హబ్ గా ఉంటుందని వెల్లడించారు. పాలియేటివ్ రిహాబిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నామని, డయాబెటీస్ క్లినిక్స్ ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఏమ్‌ఎన్ జే క్యాన్సర్ ఆస్పత్రిలోని అన్ని విభాగాలను క్షేత్రస్థాయిలో స్వయంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ పరిశీలించారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసులును వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

Tags:    

Similar News