Battalion constables: మా భార్యలపై ఇవేం మాటలు.. ఉన్నతాధికారుల తీరుపై బెటాలియన్ కానిస్టేబుళ్ల ఆందోళన

ఉన్నతాధికారుల తీరుపై పలు బెటాలియన్ లో కానిస్టేబుళ్లు ప్రత్యక్షంగా ఆందోళను దిగారు.

Update: 2024-10-26 07:25 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో ఒకే పోలీస్ విధానం (Battalion Police) అమలు చేయాలని జరుగుతున్న ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. నిన్నటి వరకు బెటాలియన్ పోలీసుల(Battalion Police) కుటుంబ సభ్యులు రోడ్లపై నిరసన వ్యక్తం చేయగా ఇవాళ కానిస్టేబుళ్లు ప్రత్యక్షంగా నిరసనకు దిగారు. పలు బెటాలియన్ లలో యూనిఫామ్ ధరించిన కానిస్టేబుళ్లు నేరుగా ఆందోళన బాట పట్టారు. తమ కోసం తమ కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తే వారి పట్ల ఉన్నతాధికారులు అనుచితంగా మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం కోసం పోరాటం చేస్తున్న తమ ఇంటివాళ్లపై ఇదేం దురుసుతనం అంటూ మండిపడుతున్నారు. ఈ క్రమంలో నల్గొండ గ్రామీణ ఎస్ఐ సైదాబాబుకు నిరసన సెగ తగిలింది. ఎస్ఐ గో బ్యాక్ అంటూ 12వ బెటాలియన్ కానిస్టేబుళ్లు నినాదాలు చేశారు. తమ కుటుంబ సభ్యులతో పాటు ఆందోళన చేస్తున్న తమపై కూడా సైదాబాబు దురుసుగా ప్రవర్తించారని నిరసనకు దిగారు. సైదాబాబును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

మరో వైపు 21వ బెటాలియన్ వద్ద పోలీసుల కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు. వరంగల్ మామునూరులో 4వ బెటాలియన్ కానిస్టేబుళ్లు ఆందోళనకు దిగారు. మామునూరు బెటాలియన్ కమాండెంట్ ఆఫీస్ వద్ద ఆందోళన చేపట్టారు. 17వ బెటాలియన్ కమాండెంట్ అనుచిత వ్యాఖ్యలపై కానిస్టేబుళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు కుటుంబ సభ్యులపై శ్రీనివాసరావు అనుచితంగా మాట్లాడారని ఆరోపించారు. శ్రీనివాసరావు అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బెటాలియన్ పోలీసులు ఆందోళన బాట పట్టారు. పోలీసుల ఆందోళన దృష్ట్యా బెటాలియన్ వద్దకు ఎస్పీ చేరుకున్నారు.

పోలీసులను పెళ్లి ఎవరు చేసుకొమ్మన్నారంటారా?:

బెటాలియన్ పోలీసులు ఆందోళనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తమ కుటుంబసభ్యులకు కౌన్సిలింగ్ ఇస్తూ ఓ ఉన్నతాధికారి టీజీపీఎస్ పోలీసులను ఎవరు పెళ్లి చేసుకోమన్నారని అంటున్నారని తమ ఉన్నతాధికారితో ఓ బెటాలియన్ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భర్తల కోసం ఆవేదన వ్యక్తం చేసిన మహిళల పట్లో ఇదేం వైఖరి అంటూ మండిపడుతున్నారు. ఈ విషయంపై తమ ఉన్నతాధికారితో కానిస్టేబుళ్లు మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.  


Tags:    

Similar News