వైన్స్ షాపులే టార్గెట్…

రాత్రి సమయంలో మూసి ఉన్న వైన్స్ షాపులే టార్గెట్‌గా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను యాదాద్రి భువనగిరి జోన్ పోలీసులు చేధించారు.

Update: 2024-03-26 09:54 GMT

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : రాత్రి సమయంలో మూసి ఉన్న వైన్స్ షాపులే టార్గెట్‌గా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను యాదాద్రి భువనగిరి జోన్ పోలీసులు చేధించారు. ఈ చోరీకి సంబంధించిన వివరాలను యాదాద్రి భువనగిరి జోన్ డీసీపీ రాజేష్ చంద్ర మంగళవారం మీడియాకు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం గత అయిదు రోజుల క్రితం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో రాత్రి సమయంలో దుర్గ వైన్స్ షెట్టర్ పగలగొట్టి గుర్తు తెలియని వ్యక్తుల చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన తుర్కపల్లి పోలీసులు గతంలో ఇలాంటి ఘటనలకు పాల్పడిన నిందితుల వివరాలను సేకరించారు. వారి దర్యాప్తులో భాగంగా కామారెడ్డి పట్టణానికి చెందిన పిన్నోజు రవి గతంలో వైన్స్ చోరీలకు పాల్పడుతుండడంతో‌ పాటు, పలు రకాల దొంగతనాలకు పాల్పడుతూ 13 కేసులలో జైలు శిక్ష అనుభవించాడు.

రవి కరీంనగర్ జైల్లో శిక్ష అనుభవిస్తుండగా 2023 డిసెంబర్ 5వ తేదీన మేడ్చల్ జిల్లా దుండిగల్ మండలం గాగిలాపూర్‌కు చెందిన బైరప్ప గారి హరీష్ హుస్నాబాద్ పీఎస్ పరిధిలో ఒక చోరీ కేసులో కరీంనగర్ జైలుకు తరలించారు. వీరిద్దరూ జైల్లో పరిచయమై కలిసి చోరీలకు పాల్పడాలని నిర్ణయించుకున్నారు. బెయిల్ పై కరీంనగర్ జైలు నుంచి విడుదల అయ్యారు. అక్కడి నుంచి వచ్చి రాజాపేట వద్ద ఒక వైన్ షాపులో చోరీకి పాల్పడ్డారు. ఈ కేసులో నల్గొండ జైలుకు వెళ్లారు. అక్కడి నుంచి బయటకు వచ్చి యాదాద్రి జిల్లా మోత్కూర్ మండలం ముసిపట్ల గ్రామానికి చెందిన శాఖాపురం నవీన్, సిద్దిపేట పట్టణానికి చెందిన చెప్యాల నర్సింహులు సహాయంతో తుర్కపల్లిలో వైన్స్‌లో చోరీకి పాల్పడి రూ. 3,45,600 నగదు, 8 మద్యం బాటిల్స్‌ను అపహరించారు. చోరీకి పాల్పడ్డ ప్రదేశం వద్ద సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో నిందితులు రెండు ద్విచక్ర వాహనాలపై జగదేవపూర్ వైపు వెళ్తుండగా పోలీసులకు వాసాలమర్రి వద్ద సోమవారం సాయంత్రం కనిపించడంతో వారిని వెంటనే అదుపులోకి తీసుకొని విచారించారు.

ఈ విచారణలో నలుగురు నిందితులు ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. వీరి వద్ద నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, రూ. 2, 04, 000 లక్షల నగదును స్వాధీనం చేసుకొని రిమాండ్ కు పంపించినట్లు డీసీపీ వెల్లడించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న A1 రవి పై గతంలో 13 కేసులు, A2 హరీష్ పై 6 కేసులు, A3 నవీన్ పై రెండు కేసులు ఉన్నాయి. ఇలా వరుస చోరీలకు పాల్పడుతున్న వీరిపై పిడి యాక్ట్ పెట్టడానికి చర్యలు తీసుకుంటున్నామని డీసీపీ వెల్లడించారు. సీసీ కెమెరాల ద్వారానే నిందితులను గుర్తించగలిగామని, ప్రజలంతా గృహాలు వ్యాపార సముదాయాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. రాత్రి సమయాల్లో దుకాణాలలో, వైన్స్‌లలో నగదును ఉంచకూడదని సూచించారు. ఈ కేసును ఛేదించిన పోలీసులను ఆయన అభినందించారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, యాదాద్రి ఏసీపీ రమేష్ కుమార్, యాదగిరిగుట్ట రూరల్ సీఐ కొండల్ రావు, తుర్కపల్లి ఎస్ఐ తక్యోద్దీన్, సిబ్బంది శ్రీనివాస్, సత్యనారాయణ, ప్రదీప్ కుమార్, రవి నాయక్, నిరంజన్ శివకుమార్ లు పాల్గొన్నారు.


Similar News