సూర్యాపేట జిల్లాలో విద్యా వ్యవస్థ గాడిన పడేనా???

సూర్యాపేట జిల్లాలో జరుగుతున్న వరుస సంఘటనలు జిల్లా విద్యాశాఖ అధికారుల పని తీరుకు నిదర్శనమని, విద్యార్థి సంఘాల నాయకులు, పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Update: 2024-07-07 08:58 GMT

దిశ, సూర్యాపేట కలెక్టరేట్ : సూర్యాపేట జిల్లాలో జరుగుతున్న వరుస సంఘటనలు జిల్లా విద్యాశాఖ అధికారుల పని తీరుకు నిదర్శనమని, విద్యార్థి సంఘాల నాయకులు, పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అంతా వారి కనుసన్నల్లోనే ??

జిల్లాలో అనుమతులు లేకుండా ప్రైవేటు విద్యా సంస్థలు తరగతులు నిర్వహిస్తున్నాయని, ప్రైవేట్ విద్యాసంస్థల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుందని, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు జిల్లా విద్యాశాఖ అధికారులకు ముడుపులు అప్పచెప్పి యథేచ్చగా విద్యా దందాను కొనసాగిస్తున్నారని, వివిధ విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్న పట్టించుకునే వారే లేరని, ప్రైవేటు విద్యా సంస్థలు విద్యా వ్యాపారాన్ని సాఫీగా కొనసాగించడానికి ఆ శాఖ అధికారులే సహకరిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

మార్పు వచ్చేనా???

సూర్యాపేట జిల్లాలో విద్యా శాఖ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీబీ గూడెంలో అనుమతులు లేకుండా శ్రీ చైతన్య పాఠశాల తరగతులు నిర్వహిస్తున్న, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పూర్తికాకుండానే పాఠశాల నిర్వహణ జరుగుతున్నట్లు తెలిసిన డి ఈవో శ్రీ చైతన్య యాజమాన్యంకు సహకరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.  జిల్లాలో ఒక్క పాఠశాలకు పర్మిషన్ తీసుకోని బ్రాంచీల పేరుతో తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలు చాలా ఉన్నాయని, పర్మిషన్ లేని పాఠశాలల నుంచి ముడుపులు తీసుకుని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలకు జిల్లా విద్యాధికారులు వత్తాసు పలుకుతూ ఆ పాఠశాల వైపు కన్నెత్తి చూడడం లేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.

అదేవిధంగా ఆత్మకూర్ (ఎస్ ) మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్ లో మృతి చెందిన 7వ తరగతి విద్యార్థి శ్యామ్ మృతి మరువక ముందే సూర్యాపేట మండలంలోని బాలెంల వద్ద గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, జూనియర్,డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గది నుంచి ఓ బ్యాగుని శుక్రవారం రాత్రి అసిస్టెంట్ కేర్ టేకర్ బయటకు తీస్తుండగా అనుమానం వచ్చిన విద్యార్థినులు ఆమెను అడ్డగించి ఆ బ్యాగును ఓపెన్ చేసి చూడగా అందులో నాలుగు బీరు బాటిళ్లు లభ్యమవటం విశేషం.. ప్రిన్సిపాల్ గదిలో బీరు సీసాలు లభ్యమైన ఘటనపై రాష్ట్ర పౌరసరఫరాల, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్తి స్థాయి విచారణ జరిపించాలని ఆదేశించారు.

బాధ్యుల పైన చర్యలు తీసుకునేనా???

నూతన కలెక్టర్ గా తేజస్ నందలాల్ పవార్ బాధ్యతలు స్వీకరించడం విద్యాశాఖలో వరుస సంఘటనలు జరగడం తో సూర్యాపేట జిల్లా విద్యాశాఖ పైన ప్రత్యేక దృష్టి సారించి,పూర్తి స్థాయి విచారణ జరిపించి బాద్యులపైన చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పిల్లల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. జిల్లాలోని ప్రైవేటు, ప్రభుత్వ విద్యాలయాలను కలెక్టర్ సందర్శించాలి.

డి ఎస్ ఓ జిల్లా కార్యదర్శి భాషిపంగు సునీల్..

సూర్యాపేట జిల్లాలో ప్రైవేటు పాఠశాలల పైన కలెక్టర్ దృష్టి సారించి అనుమతులు లేకుండా, బ్రాంచీల పేరుతో తరగతులు నిర్వహిస్తున్న విద్యాసంస్థలను గుర్తించి సీజ్ చేయాలి. అదేవిధంగా ఫీజుల పేరుతో నిలువు దోపిడీ చేస్తున్న పాఠశాలల పైన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ విద్యాలయాలను ఆకస్మికంగా తనిఖీలు చేసి సమస్యలను గుర్తించి అందుకు బాధ్యులైన అధికారుల పైన చర్యలు తీసుకోవాలి.


Similar News