లింగమంతుల స్వామి గుడి వద్ద శాశ్వత నిర్మాణాలు చేపడతాం
పెద్దగట్టు లింగమంతుల స్వామి గుడి వద్ద శాశ్వత నిర్మాణాలు చేపట్టి అభివృద్ధి చేస్తామని తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పటేల్ రమేష్ రెడ్డి అన్నారు.
దిశ,చివ్వెంల : పెద్దగట్టు లింగమంతుల స్వామి గుడి వద్ద శాశ్వత నిర్మాణాలు చేపట్టి అభివృద్ధి చేస్తామని తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జాతరగా గుర్తింపు పొందిన దురాజ్ పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి ఆలయాన్ని సందర్శించి, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఫిబ్రవరి నెల 16వ తేది నుండి 20వ వరకు జరిగే లింగమంతుల స్వామి జాతరకు గుట్టపై పరిసరాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ కార్పొరేషన్ చైర్మన్ గా తాను పెద్దగట్టు అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో మాట్లాడి జాతరకు 10 కోట్ల రూపాయల నిధులు కావాలని కోరడం జరిగిందని తెలిపారు. జిల్లా కలెక్టర్, ఎస్పి ఇప్పటికే జాతర జరిగే ఆలయాన్ని సందర్శించినట్లు తెలిపారు. త్వరలోనే గుట్ట చైర్మన్ నియామకం చేస్తామని అన్నారు. గతంలో బీఆర్ఎస్ పాలనలో పెద్దగట్టు వద్ద జాతర సమయంలో నిధులు మంజూరు చేసి, హడావుడిగా కొన్ని పనులు చేసి బిఆర్ ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వ నిధులు స్వాహా చేశారని అన్నారు. గుట్టపైకి వాహనాలు వెళ్లడానికి రోడ్డు నిర్మాణం చేస్తామని అన్నారు. గుట్టపైన భక్తులు రాత్రి పూట నిద్ర చేయడానికి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేస్తామని,దేవాలయం సమీపంలో పూజారులు నివాసం ఉండేలా రెసిడెన్షియల్ క్వార్టర్ల నిర్మాణం చేస్తామని, భక్తులకు మరుగుదొడ్లు, స్నానపు గదుల నిర్మాణం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉండ్రుగొండ దేవాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ వురా రామ్మూర్తి యాదవ్ ,షఫీ,గట్టు శ్రీనివాస్,ముదిరెడ్డి రమణ రెడ్డి ఫరూక్, ఉపేందర్, రమేష్ నాయుడు,తార సింగ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు,దేవాలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.