అప్పటి విజయాన్ని నేటి ఓటమిని గర్వంగా అందుకున్నాం
పదేళ్లు గర్వంగా విజయాన్ని అందుకున్న మాదిరిగానే ఓటమిని కూడా అదే స్థాయిలో స్వీకరిస్తున్నామని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ స్పష్టం చేశారు.
దిశ, తుంగతుర్తి: పదేళ్లు గర్వంగా విజయాన్ని అందుకున్న మాదిరిగానే ఓటమిని కూడా అదే స్థాయిలో స్వీకరిస్తున్నామని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ స్పష్టం చేశారు. ప్రజలు మార్పు కోరుకున్నారో ఏమో కానీ మనల్ని ఓడించారని, ఈ మేరకు ప్రజలపై నిందలు, శాపనార్ధాలు పెట్టడం సరికాదని పార్టీ క్యాడర్‌కు సూచించారు. ముఖ్యంగా పార్టీ క్యాడర్ ని అన్ని రకాలుగా కాపాడుకోవడమే కాకుండా రాబోయే కాలంలో సుస్థిరంగా బలపడుతూ వివిధ రకాల ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉంటామని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ధైర్యంగా ముందుకు సాగిన తాను అదే స్థాయిలో ఉంటానని అన్నారు. బుధవారం తిరుమలగిరి మండల కేంద్రంలో జరిగిన నియోజకవర్గ స్థాయి బారాస పార్టీ కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై ప్రసంగించారు. ముఖ్యంగా ఓటమికి గల కారణాలను వివరించడమే కాకుండా క్యాడర్ కు ధైర్యాన్ని నూరిపోస్తూ భవిష్యత్ కార్యక్రమాలపై కిషోర్ సూచనలు చేస్తూ అరగంటకు పైగా ప్రసంగించారు.
క్యాడర్ అండతోనే 10 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగిన తాను నియోజకవర్గాన్ని ఊహించిన దానికంటే ఎక్కువగానే అభివృద్ధి పరిచానని అన్నారు. ముఖ్యంగా తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచాక ప్రజలకు దగ్గర కావడానికి మూడేళ్లు పట్టిందని వివరించారు. అంతర కాలంలో అవకాశాలున్నంత మేరకు ప్రభుత్వపరంగా అధికంగా నిధులు తీసుకొచ్చి నీతి, నిజాయితీ, నిబద్ధతతో అభివృద్ధి చేశానని ఆయన గర్వంగా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా తనపై కొంతమంది చాలా రకాలుగా కామెంట్స్ చేసినప్పటికీ అందులో అర్థం లేదని ఖండించారు. అహర్నిశలు ప్రజలకు అందుబాటులో ఉన్నానని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎవరు కూడా ఊహించని దానికంటే తుంగతుర్తి అభివృద్ధి జరిగిందని, కాళేశ్వరం జలాలు తుంగతుర్తికి వస్తాయనే విషయాన్ని కలలో కూడా ఊహించలేదని వివరించారు.
ఎదుటి పక్షాలు వివిధ రకాలుగా మనపై చేస్తున్న విమర్శలను తిప్పి కొట్టడంలో విఫలమయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సూర్యాపేట జెడ్పీ చైర్ పర్సన్ గుజ్జ దీపిక యుగేందర్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ రజని, నాయకులు కంచర్ల రామకృష్ణారెడ్డి, రజాక్ తో పాటు వివిధ మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, తదితరులు పాల్గొన్నారు.