మళ్లీ కలవరపెడుతున్న ఫ్లోరైడ్ భూతం..
ఫ్లోరైడ్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఉమ్మడి నల్లగొండ జిల్లా. కాళ్లు, చేతులు వంకర్లు తిరిగి పోయిన అభాగ్యులు కళ్లముందు మెదులుతారు.
దిశ, మర్రిగూడ : ఫ్లోరైడ్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఉమ్మడి నల్లగొండ జిల్లా. కాళ్లు, చేతులు వంకర్లు తిరిగి పోయిన అభాగ్యులు కళ్లముందు మెదులుతారు. ఫ్లోరైడ్ కేసులు నమోదు కావడంతో ఈ ప్రాంత ప్రజలు భయ కంపితులవుతున్నారు. ఈ నెల 19న మండలంలో ప్రారంభమైన ఫ్లోరైడ్ ఇంటింటా సర్వేలో కేసులు బయటపడుతున్నాయి. ఫ్లోరైడ్ కేసులు నమోదు కావడంతో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రత్యేకంగా దృష్టి సారించారు. మండలంలో ఉన్న ప్రతి ఇంటిలో ఉన్న సభ్యులను ఫ్లోరైడ్ పరీక్షలు నిర్వహించాలని వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మండలంలోని 20 గ్రామపంచాయతీ పరిధిలో 40 గ్రామాల్లో 970 కుటుంబాలు ఉండగా 39,700 వేల జనాభా ఉంది. ప్రతి ఇంటికి వైద్య సిబ్బంది వెళ్లి ఫ్లోరోసిస్ పరీక్షలు నిర్వహించి నివేదిక అందజేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ నెలాఖరు లోగా మండల వ్యాప్తంగా ఫ్లోరైడ్ పరీక్షలు చేసి నివేదికను ఉన్నతాధికారులకు అందించడం కోసం వైద్య సిబ్బంది గ్రామాల్లో విస్తృతంగా ఫ్లోరైడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో రోజురోజుకు వెలుగు చూస్తున్న ఫ్లోరైడ్ కేసులతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
సర్వేలో నమోదవుతున్న ఫ్లోరైడ్ కేసులు..
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలతో మర్రిగూడ మండలంలో ఈనెల 19 నుంచి గ్రామాల్లో వైద్య సిబ్బంది ఇంటింటా ఫ్లోరోసిస్ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలతో మండల కేంద్రంలోని 30 పడకల ఆసుపత్రిలో వైద్య సిబ్బందికి ఆశా వర్కర్లకు ఫ్లోరోసిస్ పైన ట్రైనింగ్ ఇచ్చారు. మరుసటి రోజు నుంచి ట్రైనింగ్ తీసుకున్న సిబ్బంది గ్రామాల్లో ఫ్లోరోసిస్ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంటింటా సర్వేతో పాటు అంగన్వాడీ పాఠశాలలో ఉన్న చిన్నారులను సైతం వైద్య పరీక్షలు నిర్వహించగా ఎక్కువగా చిన్న పిల్లల్లోనే ఫ్లోరోసిస్ మహమ్మారి సోకినట్లుగా గుర్తించారు. ఫ్లోరోసిస్ దంతాలపైన ప్రభావం సహజంగా చూపిస్తుంది. ప్రస్తుతం దంతాల కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రధానంగా శివన్నగూడ గ్రామంలో 53 మంది ఫ్లోరోసిస్ బారిన పడినట్లుగా వైద్య సిబ్బంది గుర్తించారు. అలాగే కొండూరులో 26 మంది మర్రిగూడ లో ఆరుగురు ఇందుర్తిలో 18 నర్సిరెడ్డి గూడెంలో 25 ఫ్లోరైడ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 6,932 మందికి ఫ్లోరోసిస్ పరీక్షలు ను వైద్య సిబ్బంది నిర్వహించారు.
ఫిల్టర్ నీరే ప్రమాదం అంటున్న నిపుణులు..
దశాబ్దాల కాలంగా ఈ ప్రాంత ప్రజలను పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్ విముక్తి కోసం తాగునీరుగా మిషన్ భగీరథ తో ఇంటింటికి కృష్ణా జలాలను అందిస్తున్నారు. ప్రారంభంలో అన్ని వర్గాల ప్రజలు తాగుతుండగా కొందరు కృష్ణా జలాలు కలుషితం అవుతున్నాయని భావించి ఫిల్టర్ నీళ్లను సేవిస్తున్నారు. కృష్ణ జలాల్లో పూర్తిగా ఫ్లోరైడ్ నిర్మూలించి ఇంటింటికి భగీరథ పైప్ లైన్ ద్వారా కృష్ణా నీటిని అందిస్తున్నారు. భూగర్భ జలాలతోనే ఫిల్టర్ నీళ్లు పూర్తిగా ఫిల్టర్ కాక ఆ నీటిని విక్రయిస్తున్నారు. దీంతో ఆ ఫిల్టర్ నీళ్లను సేవించిన వారిలోనే ఫ్లోరైడ్ ఉన్నట్లుగా నిపుణులు పేర్కొంటున్నారు. నీళ్లు విక్రయించే యాజమాన్యాలు పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించకుండా ఫిల్టర్ వాటర్ ను గ్రామాల్లో విక్రయించడంతో మళ్లీ ఫ్లోరోసిస్ మహమ్మారి మొదలైందని ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ కంచుకోట్ల సుభాష్ ఆరోపిస్తున్నారు. నెలకు ఒకసారి సైతం ఫిల్టర్ యాజమాన్యాలు పరీక్షలు నిర్వహించకుండా ఫిల్టర్ నీటిని విక్రయిస్తూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడటం పట్ల నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కలెక్టర్ ఆదేశాలతోనే ఫ్లోరైడ్ పరీక్షలు.. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి డిప్యూటీ డీఎంహెచ్ఓ
జిల్లా కలెక్టర్ త్రిపాఠి ఆదేశాలతోనే మర్రిగూడ మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఫ్లోరోసిస్ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని చండూరు డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి పేర్కొన్నారు. సహజంగా ప్రతి ఏడాది ఒక్కొక్క దాని పైన వైద్య పరీక్షలు నిర్వహిస్తుండగా కలెక్టర్ ఆదేశాలతో ఈసారి పోయిందనుకున్నా ఫ్లోరోసిస్ పైన సర్వే నిర్వహించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు మర్రిగూడ మండల కేంద్రంలో ఈ నెల 18న వైద్య సిబ్బందికి ఫ్లోరైడ్ మహమ్మారిపై ట్రైనింగ్ ఇచ్చాం. మూడు రోజుల్లోనే ఫ్లోరోసిస్ కేసులు నమోదు కావడంతో మరింత దృష్టి పెట్టి ప్రతి ఒక్క ఇంటిలో ఉన్న సభ్యులందరికీ ఫ్లోరోసిస్ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ నెలాఖరు వరకు పరీక్షలు నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని ఆయన తెలిపారు.