చెరువులో నీళ్లు వృథా.. తూములను పర్యవేక్షించని నీటిపారుదల శాఖ అధికారులు..?

సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం బండమీది చందుపట్ల గ్రామంలోని చెరువు తూము నుంచి నీరు వృధాగా పోతున్నా, నీటిపారుదల శాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు.

Update: 2024-12-28 06:55 GMT

దిశ, సూర్యాపేట కలెక్టరేట్ : సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం బండమీది చందుపట్ల గ్రామంలోని చెరువు తూము నుంచి నీరు వృధాగా పోతున్నా, నీటిపారుదల శాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో భవిష్యత్తులో నీటి గండం తప్పదని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. మిషన్ భగీరథ ఫ్లాంట్ ద్వారా శుద్ధి చేసిన వేస్ట్ వాటర్ తో పాటు సమృద్ధిగా వర్షాలు కురియడంతో చెరువుకు జలకళ ఉట్టిపడుతున్నది. చెరువు నిండుగా ఉండడంతో ఆయకట్టు రైతులకు నీటి తిప్పలు తప్పాయి. అంతే కాకుండా పరిసర ప్రాంత బావుల్లో భూగర్భ జలాలకు సైతం లోటు లేదు. దాదాపు ఈ చెరువు ద్వారా 100-150 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందుతున్నదని సమాచారం.

ముడుపుల ఆశతో పట్టించుకోని అధికారులు ?

చెరువుకు జాతీయ రహదారి (365 బీబీ ) కోళ్ల ఫామ్ సమీపంలో ఉన్న తూము నుంచి నెల రోజుల నుంచి కొంత మంది వ్యక్తులు చేపలు పట్టేందుకు చెరువు నీటిని ఖాళీ చేస్తున్నారు. నీటిపారుదల శాఖ అధికారులే ముడుపులకు ఆశపడి చెరువు తూము నుంచి నీరు వృధా పోవడానికి సహకరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తూము వద్ద ఇసుక బస్తాలు వేసి నీరు లీక్‌ కాకుండా చూడాలని పలుమార్లు సంబంధిత అధికారులకు మొర పెట్టుకున్నా ఫలితం లేదని ఆరోపిస్తున్నారు. ఇలాగే చెరువులోని నీరు వృథాగా పోయినట్లయితే వచ్చే సంవత్సరం సాగునీటికి ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తూము నుంచి నీరు పోకుండా చూడాలని తూము తీస్తున్న వ్యక్తులను గుర్తించాలని, అదేవిధంగా వారికి సహకరిస్తున్న నీటిపారుదల శాఖ అధికారుల పైన చట్ట పరమైనచర్యలు పలువురు కోరుతున్నారు.


Similar News