రియల్ మాయ..అనుమతులు లేకుండానే విక్రయాలు..

నార్కట్ పల్లి మండలం చెరువుగట్టు శివారులో సర్వే నెంబరు

Update: 2024-12-29 02:03 GMT

దిశ,నార్కట్ పల్లి : నార్కట్ పల్లి మండలం చెరువుగట్టు శివారులో సర్వే నెంబరు 139, 140, 141, 142 లో ఉన్న క్రాంతి రియల్ ఎస్టేట్ గ్రీన్ ల్యాండ్స్ కాలనీ వెంచర్ లో అడుగడుగున అక్రమాలు ఉన్నట్లు తెలుస్తోంది. 2011లో 23 ఎకరాల 35 గుంటల్లో వెంచర్ ఏర్పాటు చేశారు. ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. ఇందులో 404 ప్లాట్లు చేయగా 83 ప్లాట్లను ఇప్పటికే విక్రయించారు. ఎటువంటి అనుమతులు తీసుకోకుండా అమాయకులకు ప్లాట్లను అంటగడుతున్నారు. ఈతంగమంతా జరుగుతున్న అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టుగా మిన్నకుండిపోయారు. దీంతో కొనుగోలు చేసిన అమాయకులు తీరా అనుమతులు లేవని తెలిసేసరికి ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు.

అనుమతులు లేకుండా రిజిస్ట్రేషన్లు ఎలా...?

అధికారులు ఏదైనా రిజిస్ట్రేషన్ చేయాలి అంటే అన్ని అనుమతులు తీసుకుని చేస్తారు. కానీ క్రాంతి రియల్ ఎస్టేట్ పేరిట గ్రీన్ ల్యాండ్ కాలనీకి ఎటువంటి అనుమతులు లేకున్నా రిజిస్ట్రేషన్లు ఎలా చేశారు తెలియడం లేదు. వ్యవసాయ భూమిని ప్లాట్లుగా కూడా మార్చి రిజిస్ట్రేషన్లు చేస్తే అన్ని నియమ నిబంధనలు చూసుకోవాలి. కానీ అలాంటిదేమీ పట్టించుకోకుండా అధికారులు రిజిస్ట్రేషన్లు చేసేశారు. దీంతో అనుమతులు లేని వెంచర్ లో ప్లాట్లు కొనుగోలు చేసిన అమాయకులు లబోదిబోమంటున్నారు.

1564 గజాల రిజిస్ట్రేషన్ వెనుక మర్మమేమిటి... ?

ఈ వెంచర్ లో 2108 గజాలు ఓపెన్ స్థలంగా ఉన్నట్లు మ్యాప్ లో చూపించారు. కానీ గత నెల 16వ తేదీన డాక్యుమెంట్ నెంబర్ 17680 కు 359 గజాలు, 17681 కి 412 గజాలు, 17682 కి 325 గజాలు, 17683కి 466 గజాల చొప్పున మొత్తంగా 1564 గజాలు రిజిస్ట్రేషన్ జరిగింది. ఇప్పటికే అనుమతులు లేకుండా కొనుగోలు చేసిన కొనుగోలు దారులు ఇబ్బందులు పడుతుంటే అవేమీ పట్టించుకోకుండా ఖాళీ స్థలాన్ని సైతం అమ్మేశారు. అంటే ఈ నిర్వాహకులకు అధికారులు ఏ విధంగా వత్తాసు పలుకుతున్నారో ఇట్టే తెలిసిపోతుంది. దీనంతటికీ కారణం భారీగా ముడుపులు ముట్టడమని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

బఫర్ జోన్ లో ప్లాట్లు...

ఈ వెంచర్ లో 14 ఎకరాల వరకు బఫర్ జోన్ ఉందనే ఆరోపణలు సైతం వినిపిస్తూనే ఉన్నాయి. అయినా అవేమీ పట్టించుకోకుండా బఫర్ జోన్ పరిధిలోను రాళ్లు పాతి ప్లాట్లు చేశారు. ఆప్లాట్లను అమ్మకాలు చేస్తున్నారు. బఫర్ జోన్ పరిధిలో ఉన్న భూమికి కట్టడాలు చేయకూడదని విషయం అందరికీ తెలిసిందే. అయినా అధికారులు అవేమీ పట్టించుకోలేదు.

తూతూ మంత్రంగా చర్యలు...

క్రాంతి రియల్ ఎస్టేట్ వెంచర్ పై ఆరోపణలు రావడంతో అధికారులు తూతూ మంత్రంగా చర్యలు తీసుకున్నారు. కేవలం కొన్ని రాళ్లను మాత్రమే పీకేసి చుట్టూ పాతిన ఫినిషింగ్ కాస్త చెరిపేసి వదిలేశారు. కేవలం ఇదంతా జనాలను మభ్యపెట్టడానికి మాత్రమే అనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఈ వెంచర్ పై పూర్తిగా చర్యలు తీసుకొని కొనుగోలుదారులకు న్యాయం చేయాలని కొనుగోలుదారులు వాపోతున్నారు.

అక్రమ వెంచర్ పై చర్యలు తీసుకోవాలి... : షబ్బీర్ హుస్సేన్, ప్రజా హక్కుల వేగుల సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి

అనుమతులు లేకుండా అక్రమంగా వెంచర్ ఏర్పాటు చేసి అమాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్న క్రాంతి రియల్ ఎస్టేట్ వెంచర్ పై చర్యలు తీసుకోవాలి. అధికారులు భారీగా ముడుపులు తీసుకొని అమాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. బఫర్ జోన్ పరిధిలో ఉన్నప్పటికీ అమ్మకాలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ పార్క్ స్థలాన్ని అమ్మేస్తున్నారు.

అనుమతులు తీసుకోవాలని నోటీసులు ఇచ్చాం.. : కే. ఉమేష్, నార్కట్ పల్లి మండల ఎంపీడీవో

చెరువుగట్టు శివారులోని క్రాంతి రియల్ ఎస్టేట్ వెంచర్ నిర్వాహకులు అనుమతులు తీసుకోవాలని నోటీసులు ఇచ్చాం. ఎటువంటి అనుమతులు లేకుండా వెంచర్ ఏర్పాటు చేశారని మా దృష్టికి రావడంతో ఇప్పటికే రాళ్లు తొలగించాం. కొనుగోలుదారులు అనుమతులు తీసుకునేంత వరకు ఎవరు కొనుగోలు చేయొద్దని సూచించాం. ఇప్పటివరకు నిర్వాహకులు అనుమతి కోసం మా వద్ద దరఖాస్తు చేసుకోలేదు. అదేవిధంగా గ్రామపంచాయతీకి చెందాల్సిన 10% జాగాలు సైతం ఇవ్వలేదు. ఎట్టి పరిస్థితుల్లో పూర్తి అనుమతులు వచ్చేంతవరకు వారిపై దృష్టి సారించి చర్యలు తీసుకుంటాం.


Similar News