ఆధార్ సేవలకు మోక్షమెప్పుడో...?

భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని మీ సేవలో ఉన్న ఆధార్ సెంటర్ గత రెండు నెలలుగా మూతపడింది.

Update: 2024-12-28 14:43 GMT

దిశ, భూదాన్ పోచంపల్లి: భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని మీ సేవలో ఉన్న ఆధార్ సెంటర్ గత రెండు నెలలుగా మూతపడింది. దీంతో మండల వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత కాలంలో ఏ పని కావాలన్నా ఆధారం ఉండాల్సిందే. ఆధార్ లేకుండా ఏ పని జరగడం లేదు. పోనీ ఆధార్ చేయించుకుందామంటే అవకాశం లేదు. వందల సంఖ్యలో మార్పులు చేర్పులు, వేలిముద్రలు,కొత్త ఆధార్ కార్డులు చేయించుకునేందుకు ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు అందుకోవాలంటే ఆధార్ తప్పనిసరి.మరి ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఆధార్ సెంటర్ పురపాలక కేంద్రమైన పోచంపల్లిలో లేకపోవడం విడ్డూరం.రెండు నెలలుగా పట్టణంలో ఉన్న ఆధార్ కేంద్రం నడవకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది. రేషన్ కార్డు పొందాలంటే ప్రతి ఒక్కరూ ఆధార్ కలిగి ఉండాలన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆధార్ సవరణ కోసం 20 కిలోమీటర్ల మేర చౌటుప్పల్ లేదా భువనగిరికి వెళ్లాల్సి వస్తోందని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ఆధార్ సెంటర్ ను ఏర్పాటు చేయాలి

పట్టణంలోని మీ సేవలో ఉన్న ఆధార్ సెంటర్ పనిచేయక రెండు నెలలు గడుస్తున్నా అధికారులు నేటికీ పట్టించుకోవడం లేదని పోచంపల్లి వాసి చింతకింది కిరణ్ అన్నారు. ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు చేయించుకోవాలంటే పక్క మండలాలకు వెళ్లాల్సి వస్తుంది. అక్కడ కూడా ఒక్కోసారి సర్వర్ పని చేయకపోవడంతో సమయం,డబ్బులు వృధా అవుతుంది. వృద్ధులు ,చిన్న పిల్లలు కలిగిన తల్లిదండ్రులు పక్క మండలాలకు వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారు. వెంటనే పట్టణంలో ఆధార్ సెంటర్ ను పున ప్రారంభించేందుకు అధికారులు చొరవ చూపాలని కోరుతున్నాము.


Similar News