నిబంధనలకు పాతర.. హోటళ్లలో కాలం చెల్లిన పదార్థాలు విక్రయం

మనిషి జీవించాలంటే ఆహారం, నీళ్లు అతి ముఖ్యం. తినేది కూడా కల్తీ లేని శుభ్రమైన ఆహారం అయ్యుండాలి.

Update: 2024-12-16 02:37 GMT

దిశ, సూర్యాపేట టౌన్: మనిషి జీవించాలంటే ఆహారం, నీళ్లు అతి ముఖ్యం. తినేది కూడా కల్తీ లేని శుభ్రమైన ఆహారం అయ్యుండాలి. ఇంట్లో వండుకోవడం కంటే బయట దొరికేది తినడానికి జనం ఇష్టపడుతున్న ప్రస్తుత రోజుల్లో అనారోగ్యం బారిన పడే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదం తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఓ వ్యక్తి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాడు. కాగా, దానిలో పురుగులు కనిపించడమే కాకుండా అందులో కుళ్లిపోయిన రైస్ ఉండడంతో ఆ వ్యక్తి ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకులతో గొడవపడ్డాడు. అలాగే కొద్దిరోజుల కింద ఆత్మకూరు.ఎస్ మండలంలోని ఏనుబాముల గ్రామానికి చెందిన వ్యక్తి ఓ బేకరీలో బ్రెడ్ ప్యాకెట్‌ కొనుగోలు చేశాడు. తీరా ఇంటికెళ్లి చూశాక గడువు ముగిసిన బ్రెడ్ తిని అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరాడు. దీంతో ఆ బేకరీ నిర్వాహకులతో బ్రెడ్ కొనుగోలు చేసిన వ్యక్తి గొడవ పడటంతో కొంత డబ్బును అతనికి ఇచ్చినట్లు సమాచారం. తాజాగా ఫుడ్ పాయిజన్ కేసులు జిల్లాలో నమోదవుతున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

జిల్లాలో వందలాది కేంద్రాలు..

సూర్యాపేట జిల్లాలో అనేక రెస్టారెంట్లు, ఆహార పదార్థాల విక్రయ దుకాణాలు ఉన్నాయి. కానీ అనధికారికంగా జిల్లాలో 23 మండల కేంద్రాల్లో పదుల సంఖ్యలో హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలు ఉన్నాయి. కాగా, సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, తుంగతుర్తి పట్టణ కేంద్రాల్లో అధిక మొత్తంలో ఉన్నాయి. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అనుమతుల్లేని దుకాణాల్లో కల్తీ ఆహారంపై నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నారు. అరకొరగా నమూనాల సేకరణ, ఫలితాల వెల్లడిలో జాప్యం వల్ల ప్రజల ప్రాణాలు గాలిలో దీపంలా మారుతున్నాయి. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. జిల్లాలో వందల ఆహార విక్రయ కేంద్రాలున్నాయి. ఇందులో చాలా వాటికి అనుమతులు లేవు. పానీపూరీ, అల్పాహారం, చికెన్ పకోడి, ఫాస్ట్ ఫుడ్, తోపుడు బండ్లకు సంబంధించి ఒక్కరికీ అనుమతి లేదు. ఇలా ప్రతి పట్టణ, మండల కేంద్రాల్లో పుట్టగొడుగుల్లా అనుమతి లేని దుకాణాలు వెలుస్తున్నాయి. వారి ఇష్టం వచ్చినట్లు ఆహార పదార్ధాలను తయారు చేసి విక్రయిస్తుండడంతో ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోంది.

కాలం చెల్లిన పదార్థాలతో అనారోగ్యం..

స్వీట్, బేకరీ పదార్థాలు తిని చాలామంది అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. పాడైన ఆహార పదార్థాలు తిన్న ప్రజలు వాంతులు, విరేచనాలు, గ్యాస్ట్రిక్ సమస్యలు, ఉదర సంబంధ వ్యాధుల బారిన పడుతున్నారు. బయటి పదార్థాలు కొనే ముందు ప్రజలు ఆ పదార్థం తయారీ, గడువు తేదీ వివరాలు చూసుకోకపోవడం ఎక్కువ నష్టం కలిగిస్తుంది. బేకరీలో తయారు చేసే పదార్థాలు ఎన్ని రోజులు నిల్వ ఉంటాయో చెప్ప లేని పరిస్థితి నెలకొన్నది. ప్యాకేజీ వస్తువులు ఎప్పుడు తయారు చేశారు? కాలం ఎప్పుడు తీరుతుందనే వివరాలు కూడా చాలా వరకు ఉండటం లేదు. ఇలా కూడా సమస్యలకు కారణమవుతున్నాయి. ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం విక్రయించే ఆహార పదార్థాలపై తగిన వివరాలు ఉండాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరిగిన నూనెలో పదే పదే ఆహార పదార్థాలను వేయించడం వల్ల వారికి జీర్ణాశయ సమస్యలతోపాటు కడుపు నొప్పి, విరేచనాలు వేధిస్తున్నాయి.

నిబంధనలు గాలికి..

ఫుడ్ సేఫ్టీ చట్టం-2012 ప్రకారం బిర్యానీ, చికెన్‌లో రంగులు వాడకూడదు. నూనెను విడిగా విక్రయించొద్దు. పట్టణ ప్రాంతాల్లో ప్రతి 50 వేల మందికి, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి లక్ష మందికి ఒక తనిఖీ అధికారి ఉండాలి. అధికారి తాను పనిచేసే పరిధిలో నెలకు 12 చోట్ల తనిఖీలు చేపట్టాలి. కానీ వాటి జాడే లేదు. అప్పుడప్పుడు విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులే దాడులు చేస్తున్నారు. జిల్లాలో గత కొన్ని నెలలుగా ఒక్క తనిఖీ జరగకపోవడం గమనార్హం. పాలు, టీ, కూల్ డ్రింక్స్, పసుపు, నెయ్యి, ఆహారం ఇలా అన్ని పదార్థాల నమూనాలు సంబంధిత అధికారులు సేకరించాలి. ఎవరైనా ఫిర్యాదు చేస్తేనో.. విషయం బహిర్గతం అయితేనో కానీ చర్యలు కనిపించడం లేదు. అధికారులు అరకొరగా సేకరించిన నమూనాలను పరీక్షించి వెంటనే ఫలితాలు వెల్లడించే వ్యవస్థ జిల్లాలో లేకపోవడంతోపాటు ల్యాబ్ హైదరాబాద్‌లో ఉండడం, నమునాలు సేకరించి కేసులు నమోదు చేయడం, అదనపు కలెక్టర్‌కు రిపోర్టు ఇవ్వడం, కోర్టుకు పంపడం వంటివి ఉండటంతో అధికారులు చూసీచూడనట్లు గా వ్యవహరిస్తున్నారు. అంతేకాక అధికారులు తనిఖీలు చేయడంలో జాప్యానికి ప్రధాన కారణం సూర్యాపేట జిల్లాకు రెగ్యులర్ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి లేకపోవడమే. ఇప్పుడున్న ఫుడ్ సేఫ్టీ అధికారి ఖమ్మం జిల్లాకు రెగ్యులర్ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతోపాటు కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాలకు ఇన్చార్జి అధికారిగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

తనిఖీలు నిర్వహిస్తున్నాం

ఖమ్మం జిల్లాకు రెగ్యులర్ ఉద్యోగిగా బాధ్యతలు నిర్వహిస్తూ కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాలకు ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. సూర్యాపేట జిల్లాలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బేకరీలు, రెస్టారెంట్లను ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నాం. కొద్ది రోజుల కిందట సూర్యాపేట జిల్లా కేంద్రంలోని డీమార్టులో, కోదాడలో తనిఖీలు నిర్వహించాం. ఎవరైనా నిబంధనలు పాటించకుండా రెస్టారెంట్, బేకరీ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను నిర్వహిస్తే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.:- కిరణ్ కుమార్, ఇంచార్జి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, సూర్యాపేట

జాగ్రత్తలు పాటించాలి

ఆహారం తినే విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి. ఇంటి వద్ద వండిన ఆహారం తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. చిన్న పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో బయట తినుబండారాలు తినిపించొద్దు. నిల్వ ఉన్న ఆహారం తినవద్దు. బయటకొనే పదార్థాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అనారోగ్యం బారిన పడతారు. :- డాక్టర్ రామ్మూర్తి, గాయత్రి ఆసుపత్రి, సూర్యాపేట


Similar News