మర్రిగూడ 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్ సేవలు

మర్రిగూడ మండల కేంద్రంలో ఉన్న 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో త్వరలో డయాలసిస్ సేవలు అందనున్నాయి.

Update: 2024-12-16 03:07 GMT

దిశ, మర్రిగూడ: మర్రిగూడ మండల కేంద్రంలో ఉన్న 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో త్వరలో డయాలసిస్ సేవలు అందనున్నాయి. దశాబ్దాల కాలంగా ఈ ప్రాంతంలో ఫ్లోరైడ్ మహమ్మారితో ఇక్కడి ప్రజలు ఫ్లోరోసిస్ బారిన పడి కాళ్లు చేతులు వంకర్లు ఒకవైపు మరోవైపు కిడ్నీ సంబంధిత వ్యాధులు ఎక్కువ కావడంతో మంచానికే పరిమితై జీవచ్ఛవంలా బతుకుతున్నారు. పుండు మీద కారం చల్లిన విధంగా ఫ్లోరోసిస్ వ్యాధి ఒకవైపు.. డయాలసిస్‌తో మరోవైపు రోగాల భారిన పడి ఈ ప్రాంత ప్రజలు ఆర్థికంగా చతికిల పడుతున్నారు. ఏళ్లకు ఏళ్లుగా పాలక పక్షాలు పట్టించుకోకపోవడంతో డయాలసిస్ రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే ముఖ్యమంత్రితో చర్చలు జరిపి మర్రిగూడ 30పడకల ఆస్పత్రిలో డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయడంతో ఈ మేరకు కేంద్రం మంజూరైంది. ఫ్లోరైడ్ మహమ్మారి ఎక్కువగా కిడ్నీలపై పడి ఇక్కడి ప్రజలు డయాలసిస్ గురవుతున్నారు.

ఏళ్లకు ఏళ్లుగా డయాలసిస్ వ్యాధితో వైద్యం చేయించుకో లేక ఎందరో మరణించారు. డయాలసిస్ సేవల కోసం అటు జిల్లా కేంద్రానికి ఇటు హైదరాబాదుకు వెళ్లి డయాలసిస్ చేయించుకుంటే రోగుల కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయేవి. ఈ డయాలసిస్ కేంద్రంలో ఐదు మిషన్లను ఏర్పాటు చేయగా ఒక్కో రోగికి నాలుగు గంటల చొప్పున డయాలసిస్ సేవలు అందనున్నాయి. ఒకే రోజులో 15 మంది రోగులకు ఉచితంగా డయాలసిస్ సేవలను సిబ్బంది ఆరోగ్యశ్రీ కింద అందించనున్నారు. ఈ మేరకు ఆస్పత్రి పై బిల్డింగ్‌లో సిబ్బంది ఐదు మిషన్లతో డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. త్వరలో ప్రారంభించేందుకు వైద్య సిబ్బంది సన్నాహాలు చేస్తున్నారు. ఈ సెంటర్ ఓపెన్ అయితే గుర్రంపోడు, నాంపల్లి, మర్రిగూడ, చింతపల్లి, చండూరు, గట్టుప్పల్ మండలాల డయాలసిస్ రోగులకు వైద్య సేవలు అందనున్నాయి. డయాలసిస్ సెంటర్ ఏర్పాటుతో ఈ ప్రాంత రోగులకు ఆర్థికంగా నష్టపోకుండా ఉచితంగా సేవలు అందనుండడంతో ఈ ప్రాంత ప్రజల జీవితాల్లో త్వరలో వెలుగు నిండనున్నాయి.

త్వరలో ప్రారంభిస్తాం

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతో ప్రభుత్వం 30 పడకల ఆస్పత్రిలో డయాలసిస్ ప్రారంభానికి సిద్ధమైంది. అధికారికంగా ప్రారంభించిన తర్వాత డయాలసిస్ రోగులకు సేవలు అందించనున్నాం. :- శంకర్‌నాయక్, ఆస్పత్రి సుపరింటెండెంట్


Similar News