బాలసదనం ఘటనలో ఇద్దరు ఉద్యోగుల సస్పెండ్..
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించిన
దిశ,యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించిన బాలసదన్ ఘటనలో ఇద్దరు అధికారులపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ డీసీపీవో, బాలసదన్ సూపరింటెండెంట్ లను విధుల నుంచి తప్పిస్తున్నట్లు కలెక్టర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత నెలలో భువనగిరి జిల్లా కేంద్రంలోని బాలసధనలో ఓ బాలికపై వెంకటరెడ్డి అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంలోకి వెలుగులోకి వచ్చింది. అనంతరం ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఈ విచారణ నిమిత్తం సోమవారం ఇద్దరినీ విధుల నుంచి తప్పిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
ఇంకో అధికారిపై చర్యలేవి అని ఆరోపణ...
ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ డీసీపీవో, సూపరింటెండెంట్ లను విధుల నుంచి తప్పించగా పీ ఓఐసీ అలివేలును ఎందుకు తప్పించడం లేదని, ఇందులో ఏదో కుట్ర జరిగిందని చర్యలకు గురైన వారు ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపినప్పుడు కూడా ముగ్గురిని బాధ్యులను చేశారని, అయితే చర్యలు తీసుకునేప్పుడు మాత్రం కేవలం ఇద్దరిపైనే చర్యలు ఎలా తీసుకుంటారని లలిత సంబంధిత కార్యాలయంలో ఆందోళనకు దిగినట్లు సమాచారం. మిగతా అధికారిపై చర్యలు తీసుకోకపోవడం వెనుక ఏదో కుట్ర దాగి ఉందని, ఖచ్చితంగా దీనిపై విచారణ జరిపించి పీఓఐసీపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పీఓఐసీ అలివేలు పాత్రపై మరోసారి విచారణ జరిపించాలంటూ జిల్లా కలెక్టర్ భువనగిరి ఆర్డీవోను ఆదేశించినట్లు తెలుస్తోంది.